
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మాత్రం అనుమతి
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
- పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని టీజీపీఎస్సీకి ఉత్తర్వులు
- మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకెళ్లిన కొందరు అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నియామకాలకు గురువారం హైకోర్టు బ్రేక్ వేసింది. గ్రూప్-1 మూల్యాంకనంపై దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసేదాకా నియామకాలను చేపట్టరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నియామక ప్రక్రియలో భాగంగా జరుగుతున్న సర్టిఫికెట్ల పరిశీలనను కొనసాగించవచ్చని తెలిపింది.
అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ సమర్పించాలని, అలాగే పిటిషనర్ల ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేస్తే మార్కులు తగ్గిన అభ్యర్థిని ఇంప్లీడ్ చేయడంతోపాటు పిటిషనర్లకు చెందిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కు వాయిదా వేసింది. గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ ఎం.పరమేశ్ మరో 19 మంది హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ఒక అభ్యర్థికి 482 మార్కులు సాధించి ఉద్యోగానికి అర్హత సాధించారని, అయితే మార్కులు పెరిగితే మంచి పోస్టు వస్తుందన్న ఉద్దేశంతో రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేస్తే ఆ మార్కులు కాస్త 422కు తగ్గించడంతో ఇప్పుడు ఎంపికే కాకుండా పోయారన్నారు.
ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్లు ఫోర్జరీ అంటున్నారని, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం నోటీసు ఇచ్చారో లేదో తెలియదని, అయితే ప్రెస్‌మీట్ పెట్టి నోటీసు ఇచ్చామని ఇక్కడ పిటిషన్ దాఖలు చేశాక చెబుతున్నారన్నారు. లాగ్డ్ హిస్టరీ పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కోఠి మహిళా కాలేజీ కేంద్రంలోని రెండు సెంటర్ల నుంచే 71 మంది ఎంపికయ్యారని తెలిపారు. 563 మందికిగాను 71 మంది ఎంపికయ్యారని, కేవలం ఇక్కడ మాత్రమే అంత మంది ఎలా ఎంపికయ్యారన్నారు.
మెయిన్స్‌కు 21,075 మంది హాజరయ్యారని, తర్వాత తుది జాబితా 21,085 అన్నారని, 10 మంది ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపై సందేహాలున్నాయన్నారు. దేశంలోని వివిధ ప్రభుత్వ కాలేజీల నుంచి నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయిస్తున్నామని టీజీపీఎస్సీ ప్రకటించిందని, అయితే వారి ప్రకటనకు విరుద్ధంగా పదవీ విరమణ చేసిన వారితో మూల్యాంకనం చేయించిందన్నారు.
మల్లిక్ అనే ప్రొఫెసర్ ప్రైవేటు సంస్థ నుంచి కూడా వేతనం పొందుతున్నారన్నారు. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్ హాల్ టికెట్ల నంబర్లు వేర్వేరుగా ఇచ్చారని, అలా ఇవ్వడంపై సందేహాలున్నాయన్నారు. మొదట 45 అని 46 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారని, దీనికి సంబంధించి కూడా కమిషన్ చెబుతున్న వివరణలో వాస్తవాలు లేవన్నారు..
ఫోర్జరీపై చర్యలు చేపట్టాం: కమిషన్ న్యాయవాది
మార్కులను ఫోర్జరీతో దిద్దుకుని రీకౌంటింగ్‌కు దాఖలు చేసిన అభ్యర్థిపై చర్యలు చేపట్టనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది పి.రాజశేఖర్ హైకోర్టుకు నివేదించారు. ఆ అభ్యర్థికి మొదట 422.5 వచ్చాయని, రీకౌంటింగ్‌లోనూ అంతే వచ్చాయన్నారు. పిటిషనర్లలో 20 మందిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులేనని, వారు ఎక్కడ పనిచేస్తున్నారన్న వివరాలను సమర్పించలేదని, పిటిషనర్లలో ఒక వ్యాపారి కూడా ఉన్నారన్నారు. ఉద్యోగాలున్న ఈ పిటిషనర్లు నిరుద్యోగులకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు.
హాల్‌టికెట్ల నంబర్లు మారినప్పటికీ ప్రతి మెయిన్స్ హాల్‌టికెట్‌లో ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నంబరు పేర్కొన్నామన్నారు. పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు 21,075 మంది రాశారని, బయోమెట్రిక్ ఆధారంగా కచ్చితమైన వివరాలు తెప్పిస్తే 21,085కు పెరిగిందన్నారు. ఒక సెంటర్‌లో దివ్యాంగులకు అనుకూలంగా లేకపోవడంతో వారికి అనుకూలంగా మరికొన్ని సెంటర్లను పరిశీలించి అదనంగా ఒక సెంటర్‌ను పెంచినట్లు తెలిపారు.
కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన 2 సెంటర్లలో ఎక్కువ మంది ఎంపికయ్యారన్న దానిపై స్పందిస్తూ సెంటరు 18లో 792కిగాను 39 మంది, 19వ సెంటరులో 864కుగాను 32 మంది ఎంపికయ్యారని, ఇది 4 శాతానికంటే తక్కువేనన్నారు. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌లో పనిచేస్తున్న జి.ఎ.మల్లిక్‌ను మూల్యాంకనం కోసం నియమించారన్న ఆరోపణ అవాస్తవమని, ఆయన చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారన్నారు. పదవీ విరమణ చేసినవారు మూల్యాంకనం చేయకూడదని నిబంధన ఎక్కడ ఉందో పిటిషనర్లు చెప్పడం లేదన్నారు.