- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
గోపాల్ పేట, వెలుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, బాలికల్లో క్రీడా స్ఫూర్తి సమాజానికి ఆదర్శం అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. గురువారం బుద్దారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో వనపర్తి జిల్లా నుంచి గోపాల్ పేట, పెద్దమందడి, కొత్తకోట, నాగర్ కర్నూల్ జిల్లా నుంచి కొల్లాపూర్, తెలకపల్లి, వెల్దండ, మన్ననూరు పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ... వనపర్తి ‘ఆటలపర్తి’ కూడా అని, అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతో చదువు, క్రీడల్లో రాణించాలని కోరారు.
భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, నూతన స్పోర్ట్స్ పాలసీ తెస్తోందని తెలిపారు. గోపాల్ పేట గర్ల్స్ గురుకుల పాఠశాలకు మరో ఎకరం స్థలం కేటాయించేందుకు ప్రతిపాదించినట్టు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఓటమి ముగింపు కాదని, క్రీడలు భవిష్యత్తులోనూ కొనసాగించాలని చెప్పారు.
ఈ సందర్భంగా వైద్య సీటు పొందిన హిమబిందు, జాతీయ కబడ్డీ శిక్షణలోని నందినిని సన్మానించారు. అనంతరం పొలికెపాడులో వ్యవసాయ విశ్వవిద్యాలయ స్థలాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, జడ్పీ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, డీవైఎస్ఓ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
