పానుగల్ మండలంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం రాస్తారోకో

పానుగల్ మండలంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం రాస్తారోకో

పాన్​గల్, వెలుగు: సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం పానుగల్ మండల కేంద్రంలో గురువారం రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య యాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యా నాయక్ మాట్లాడుతూ.. రైతులకు వంద శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తోందని, రైతు వేదికల వద్ద అధికారులు టోకెన్లు ఇచ్చినప్పటికీ రైతులకు సరిపడా వేరుశనగ విత్తనాలను గోదాములో ఉంచడం లేదన్నారు.

 అవసరం ఉన్న రైతులందరికీ సబ్సిడీ వేరుశనగ విత్తనాలను అందించాలని డిమాండ్​ చేశారు. నాయకులు సిఫార్సు చేసిన వారికి మాత్రమే వేరుశనగ విత్తనాల బ్యాగులను ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. రాస్తారోకో దగ్గరికి మండల వ్యవసాయ అధికారి మణిచందర్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు రాస్తారోకో వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. 

గోదాంలో స్టాక్ అయిపోవడం వల్ల రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయడం లేదని, ప్రభుత్వ నుండి కోటా వస్తే వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తామని ఏవో తెలిపారు. రైతులకు సరిపడా విత్తనాలను మంజూరు చెయ్యాలని వినతి పత్రాన్ని వ్యవసాయ అధికారికి అందజేశారు. అవసరమున్న రైతులందరికీ వేరుశనగ విత్తనాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.