మహబూబ్ నగర్ (నారాయణపేట), వెలుగు: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి హౌసింగ్ అధికారులు, మండలాల ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, బేస్ మెంట్, రూఫ్, స్లాబ్ దశల్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని పూర్తయ్యాయని హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు.
మండలాల వారీగా ఎంపీడీవోలకు ఇచ్చిన లక్ష్యాల్లో ఎవరు చేరుకున్నారని ప్రశ్నించారు. ఆలస్యంగా పనులు చేస్తున్న నర్వ, మరికల్, మక్తల్ మండలాల ఎంపీడీవోల నుంచి వివరణ కోరారు. ఇసుక, మొరం, వర్షాల కారణంగా ఆటంకం కలిగిందని వారు చెప్పగా, ఎక్కువ వర్షాలు పడిన ఇతర జిల్లాల్లోనూ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, ఇలాంటి కారణాలు సరికావని అన్నారు. వారం రోజుల్లో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇప్పటివరకు మొదలుపెట్టని ఇళ్లను 45 రోజుల నిబంధన ప్రకారం రద్దు చేయాలని స్పష్టం చేశారు. కొత్త ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని సూచించారు. అనంతరం ఇందిరా డెయిరీ షీప్ ఫార్మింగ్ స్కీమ్ కింద కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాలు, మద్దూరు, కోస్గి మున్సిపాలిటీల్లో 631 అప్లికేషన్లు వచ్చాయని మైనార్టీ సంక్షేమ అధికారి ఎం.ఏ. రషీద్ తెలిపారు.
వీటిని ఎంపీడీవోలు వెరిఫై చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం, ఆస్తి పన్నుల వసూళ్లపై ఎంపీడీవోలు దృష్టి సారించాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు సమయానికి గ్రామాలకు చేరుతున్నారా అని అడిగారు. బాల్య వివాహాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పంచాయతీ, మండల కార్యాలయాల్లో హెల్ప్ లైన్ నంబర్ రెండు రోజుల్లో రాయించాలని ఆదేశించారు.సమీక్షలో డీఆర్ డీఓ మొగులప్ప, హౌసింగ్ డీఈ, మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.
