వరంగల్ జిల్లాలో నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం (నవంబర్ 24) లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన హైకోర్టు.. మున్సిపాలిటీగా గుర్తించేందుకు అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జిల్లాలోని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చేలా ఆదేశించాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మున్సిపాటీ ఏర్పాటుకు హైకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
నెక్కొండ మేజర్ గ్రామపంచాయితీని నెక్కొండ, అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామ పంచాయితీ లను కలిపి మున్సిపాలిటీగా చెయ్యాలని పిటిషన్ లో పేర్కొన్నారు . పిటిషన్ విచారించిన కోర్టు నెక్కొండకు మున్సిపాలిటీగా మార్చేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వానికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సూచించింది.
వరంగల్ జిల్లాలో ప్రస్తుతం మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలు ఉండగా.. నెక్కొండ మున్సిపాలిటీగా మారితే మొత్తం నాలుగు అవనున్నాయి. నెక్కొండను మున్సిపాలిటీగా చేస్తే.. ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు.
