చనిపోయినోళ్లకు టెస్టులు చేయకుంటె ఎట్ల?

చనిపోయినోళ్లకు టెస్టులు చేయకుంటె ఎట్ల?

హైదరాబాద్, వెలుగు: ఇండ్లల్లో మరణించిన వారికి కరోనా టెస్ట్​లు చేయకపోతే వాళ్లు ఎలా చనిపోయారో ఎలా తెలుస్తుందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆస్పత్రిలో చనిపోతే ఫలానా కారణంగా మరణించినట్లు రికార్డు ఉంటుందని, ఇళ్లల్లో చనిపోతే ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందని న్యాయమూర్తులు జస్టిస్‌‌ ఎమ్మెస్‌‌ రామచందర్‌‌రావు, జస్టిస్‌‌ లక్ష్మణ్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ సందేహం వ్యక్తం చేసింది. మృతదేహాల నుంచి రక్త నమూనాలు తీసుకుని టెస్టులు చేసేలా ఉత్తర్వులివ్వాలంటూ టీజేఎస్‌‌ నేత పీఎల్‌‌ విశ్వేశ్వర్‌‌రావు, డాక్టర్‌‌ రాజేంద్రకుమార్‌‌ విడివిడిగా వేసిన పిల్స్‌‌ను హైకోర్టు గురువారం విచారించింది. ఐసీఎంఆర్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ మేరకే పరీక్షలు చేస్తున్నామంటూ హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక అందజేసింది. గర్భిణీలకు పౌష్టికాహారం అందించే ఆరోగ్యలక్ష్మి స్కీమ్‌‌ అమలు చేస్తున్నట్లు మరో నివేదిక అందజేసింది. గద్వాలకు చెందిన గర్భిణి జనీలా మరణించే ముందు అధికారులు పౌష్టికాహారం అందించారని తెలిపింది. దేశవిదేశాల నుంచి ఎంతోమంది వస్తున్న తరుణంలో వైరస్‌‌ వ్యాపించే ప్రమాదం ఉందని, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణను 26కు వాయిదా వేసింది.

అందరికీ టెస్టులు సాధ్యం కాదు

అందరికీ కరోనా టెస్టులు చేయడం సాధ్యం కాదని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వ ఆర్థిక/వైద్య వసతులను దృష్టిలో పెట్టుకుని అడుగులు వెయ్యాలేగానీ ఇంటికొకరికి టెస్టులు చేయాలనడం కరెక్ట్​ కాదని పేర్కొంది. సూర్యాపేట లాంటి ఏరియాల్లో ఇంటికొకరికైనా టెస్టులు చేయించాల్సిందిగా కోరుతూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్​ సంకినేని వేసిన పిల్​ను జస్టిస్​ ఎంఎస్​ రామచందర్​రావు, జస్టిస్​ లక్ష్మణ్​లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ‘‘పిల్​లో లేవనెత్తిన అంశాలు ఎక్కువగా చట్టబద్ధమైనవే. అయితే, వాటి అమలుకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కరోనా లక్షణాలు లేని ఎక్కువ మందికి టెస్టులు చేయడం ఎలా సాధ్యం? ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో భారం అవుతుంది. పైగా, పరీక్షలు నిర్వహిస్తామంటే జనం భయపడే ప్రమాదం కూడా ఉంటుంది”అని పేర్కొంది. ఐసీఎంఆర్​ ఎంపిక చేసిన ప్రైవేట్​ ల్యాబుల్లో కరోనా టెస్టులు చేస్తే వచ్చిన నష్టమేంటని ఇటు ప్రభుత్వాన్నీ హైకోర్టు ప్రశ్నించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ల్యాబులు, ఆస్పత్రులను సేవలను వాడుకోవడం ఎంతో అవసరమని పేర్కొంది. రూ.4,500 ఖర్చును భరించేవాళ్లే ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులు చేయించుకుంటారని, పేదలకు ప్రభుత్వం టెస్టులు చేయడం తప్పుకాదని, కానీ, ప్రైవేట్​ ల్యాబులకు ఎందుకు అనుమతివ్వడం లేదని సర్కారును ప్రశ్నించింది. ఆర్థిక స్థోమత ఉన్నోళ్లు ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులు చేయించుకుంటే ప్రభుత్వానికీ భారం తగ్గుతుందని చెప్పింది. లక్షణాలు లేనివారికీ కరోనా పాజిటివ్​ వస్తోందని, తక్కువ టెస్టులు చేయడం వల్ల నష్టమే ఎక్కువని పిటిషనర్​ తరఫు లాయర్​ జి.పూజిత వాదించారు. అయితే, రాష్ట్రంలోని అందరికీ పరీక్షలు చేయాలనడం రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్​కు వ్యతిరేకమని హైకోర్టు పేర్కొంది. తమకు పిల్​ కాపీ అందలేదని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్​ ప్రసాద్​ చెప్పడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరో ఐదుగురు ప్రతివాదుల వివరణతో కౌంటర్​ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. తర్వాతి విచారణను 18కి వాయిదా వేసింది.

పైలట్ ప్రాజెక్టులోనూ పానీకి తిప్పలే