గవర్నర్‌‌కు ఫైల్‌‌ పంపి.. చేతులు దులుపుకుంటే ఎట్ల?

గవర్నర్‌‌కు ఫైల్‌‌ పంపి.. చేతులు దులుపుకుంటే ఎట్ల?

హైదరాబాద్, వెలుగు: జీవిత ఖైదీ క్షమాభిక్ష విషయంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి తీరుపై హైకోర్టు ఫైర్​అయింది. క్షమాభిక్ష ఫైలు గవర్నర్‌‌కు పంపి చేతులు దులుపుకుంటే సరిపోదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం ఫైల్‌‌ పంపిన తర్వాత ఫాలోఅప్‌‌ చేసి దానిని గవర్నర్‌‌ ఆమోదించేలా చూడాల్సిన బాధ్యతను నిర్వహించలేదని తప్పుపట్టింది. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన తన తండ్రి మహ్మద్‌‌ సర్వర్‌‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కుమారుడు మహ్మద్‌‌ సర్పరాజ్‌‌ ఇచ్చిన వినతిపత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు 2021 జూన్‌‌లో అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలు కాలేదని సర్పరాజ్‌‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ వేశారు. హైకోర్టు ఆదేశాల్ని అధికారులు కావాలని ఉల్లంఘించారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

ఏపీ వక్ఫ్​ బోర్డు డిప్యూటీ సెక్రటరీ  హత్య కేసులో సర్వర్‌‌కు యావజ్జీవ శిక్ష పడింది. సెక్రటరీ విధుల్లో ఉండగా హత్య జరగలేదు కాబట్టి పబ్లిక్‌‌ సర్వెంట్‌‌ పరిధి కాదని 2021లో ఇదే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అదే కారణంతో తమ వినతిపత్రాన్ని తిరస్కరించారని చెప్పారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఫైల్‌‌ గవర్నర్‌‌కు పంపితే సరిపోదని, దానికి ఆమోదం లభించేలా అధికారులు ఫాలోఅప్‌‌ చేయాలని చెప్పింది. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. సత్వరమే క్షమాభిక్ష ఫైల్‌‌కు గవర్నర్‌‌ ఆమోదం లభించేలా చేసి, రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదలకు ప్రయత్నించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శికి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అమలుకాకుంటే పిటిషనర్‌‌ తిరిగి హైకోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పించారు.