రాయదుర్గంలోని నిర్మాణాల్ని కూల్చొద్దు :హైకోర్టు

రాయదుర్గంలోని నిర్మాణాల్ని కూల్చొద్దు :హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఉన్న 53 ఎకరాల్లోని నిర్మాణాల జోలికి వెళ్లరాదని టీఎస్‌‌ఐఐసీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామంలోని 53 ఎకరాల వ్యవహారంపై జోక్యం చేసుకోరాదని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టీ వినోద్‌‌ కుమార్‌‌ డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం ఆదేశించింది. టీఎస్‌‌ఐఐసీ తమ నిర్మాణాల కూల్చివేస్తున్నదని పేర్కొంటూ.. విశ్వేశ్వర ఇన్ఫ్రా, విశ్వేశ్వరా ప్రాపర్టీస్, తేజాస్‌‌ ప్రాపర్టీస్, అవ్యయ, ఇషానా, లోకంకరా, జగదీశా రియాల్టీ సంస్థలు హైకోర్టులో అప్పీల్‌‌ పిటిషన్లు దాఖలు చేశాయి. 

సర్వే నెంబర్‌‌ 83లో మొత్తం 526 ఎకరాలు ఉన్నాయని, అర్బన్‌‌ ల్యాండ్‌‌ సీలింగ్‌‌ నిబంధనల ప్రకారం 99 ఎకరాలు యజమానులకు మిగిలాయని తెలిపారు. అందులో 53 ఎకరాలను తాము కొనుగోలు చేశామని పిటిషనర్ల న్యాయవాది కోర్టుకు వివరించారు. భూమి యాజమాన్య హక్కులపై సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవన్నారు. 

దీనిపై స్పందించిన హైకోర్టు, అప్పీల్‌‌దారులకు వ్యతిరేకంగా సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన టైటిల్‌‌ నిర్ణయించడాన్ని రద్దు చేసింది. 470 ఎకరాలు ప్రభుత్వ అధీనంలో ఉందని, మిగిలిన 53 ఎకరాల్లోని అప్పీల్‌‌దారులు చేసిన నిర్మాణాలను కూల్చొద్దని టీఎస్‌‌ఐఐసీని ఆదేశించింది. టైటిల్‌‌ వివాదంపై సంబంధిత కోర్టులో తేల్చుకోవాలంది. అప్పీళ్లపై విచారణను ముగించింది.