
హైదరాబాద్, వెలుగు: విద్యుత్తు స్తంభాలకు అనుమతి లేకుండా ఉన్న కేబుళ్లను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. అనుమతులు ఉన్న వాటిని గుర్తించి, అవి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలంది. వాటిపై చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
అంతేగాకుండా అనుమతులున్న కేబుల్ ఏజెన్సీలు అనధికారిక కేబుళ్లను తొలగించడానికి విద్యుత్తు సిబ్బందికి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కేబుళ్లను తొలగించడానికి, ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, టీజీఎస్పీడీసీఎల్ లను గత విచారణలో హైకోర్టు ఆదేశించింది.
దీంతో అవి సోమవారం అఫిడవిట్లను దాఖలు చేశాయి. విద్యుత్ స్తంభాలకు చాలా కేబుళ్లు ఉంటున్నాయని, వాటిలో ఏవి చట్ట ప్రకారం ఉన్నాయో ఏవి చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసినవో గుర్తించేందుకు కష్టం అవుతుందని తెలిపాయి. వీటిపై చర్యలు తీసుకోడానికి చాలా సమయం పడుతుందని చెప్పాయి. ఈ వివరాలను జస్టిస్ నగేశ్ భీమపాక రికార్డుల్లో నమోదు చేసుకున్నారు.
దీనిపై తగిన ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు. హైదరాబాద్ సిటీలోని రామంతాపూర్‌లో విద్యుదాఘాతంతో ఆరుగురు మరణించిన ఘటన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కేబుళ్లను కట్ చేయడాన్ని సవాల్ చేస్తూ భారతి ఎయిర్ టెల్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.