వీఆర్ఏల సర్దుబాటుకు హైకోర్టు బ్రేక్

వీఆర్ఏల సర్దుబాటుకు హైకోర్టు బ్రేక్
  • ప్రభుత్వ జీవోలను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు
  • సర్దుబాటుపై వివరణ ఇవ్వాలని సర్కారుకు నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వీఆర్​ఏల సర్దుబాటుకు హైకోర్టు బ్రేక్ వేసింది. వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించింది. వీఆర్​ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇచ్చిన జీవోలు 81, 85 ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జులై 24న జీవో జారీ చేయడానికి ముందు ఉన్న స్థితినే యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. ఇప్పటికే వివిధ శాఖల్లో చేరిన వీఆర్ఏల నియామక ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట ప్రకారం.. ప్రొసీజర్ అనుసరించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా, హడావిడిగా రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు వీఆర్ఏలు మొత్తం మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవిదేవి బెంచ్​ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు అడ్వొకేట్లు పీవీ కృష్ణయ్య, శ్రీరాం పొలాలి వాదనలు వినిపించారు. వీఆర్​ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే నెపంతో  ఎలాంటి ప్రయోజనాలు చెల్లించకుండా రిటైర్ అయ్యే పరిస్థితి కల్పిస్తున్నారని అన్నారు. పెద్ద వయస్సు కలిగిన వీఆర్ఏలకు ఈ నియామకాల వల్ల తీవ్ర నష్టం కలుగుతుందఅని పేర్కొన్నారు. 

దీనిపై కోర్టు స్పందిస్తూ.. సర్దుబాటు ప్రక్రియకు ముందు అభ్యంతరాలు స్వీకరించారా ? డిమాండ్ ఉందని చెప్పి హడావిడిగా ఎలా సర్దుబాటు చేస్తారని, వీఆర్వోలకు వీఆర్ఏలకు మధ్య ఎందుకీ వివక్ష అని నిలదీసింది. ఈ మేరకు వీఆర్ఏల సర్దుబాటు వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ కేసులో రెవెన్యూశాఖ మంత్రి హోదాలో సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతివాదులుగా ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో వారిని ప్రతివాదుల జాబితాలో నుంచి తొలగించేందుకు పిటిషనర్లు అంగీకరించారు.  కేసు 4 వారాలకు వాయిదా పడింది.