పొరుగు రాష్ట్రాల్లో లక్షల్లో కరోనా టెస్టులు.. ఇక్కడ వేలల్లోనేనా?

పొరుగు రాష్ట్రాల్లో లక్షల్లో కరోనా టెస్టులు.. ఇక్కడ వేలల్లోనేనా?
  • ఇది జనం ప్రాణాల వ్యవహారం..
  • టెస్టులు ఎందుకు చేస్తలేరు?
  • ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​
    ఎందుకు అమలు చేయట్లేదు?
  • టెస్టులు చేయకుండానే
    రెడ్ జోన్​ను గ్రీన్​ జోన్ గా మార్చేస్తరా?
  • మృతదేహాలకు టెస్టులు చేయండి..
    ‘వలస’ లెక్కలు చెప్పండి
  • తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా?
  • రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
  • ఈ నెల ఒకటో తేదీ నుంచి చేసిన అన్ని టెస్టుల వివరాలు ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువగా చేస్తుండటంపై హైకోర్టు మండిపడింది. పాజిటివ్‌ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారు, వైరస్​ లక్షణాలున్న వారు, లక్షణాలతో మరణించిన వారికి టెస్టులు చేయాలంటూ స్పష్టంగా ఐసీఎంఆర్ గైడ్​లైన్స్​ ఉన్నా ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడిన వ్యవహారమని మర్చిపోతున్నారా అని నిలదీసింది. ‘తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? దేశ చట్టాలేమీ వర్తించవా? సొంత చట్టాలను అమలు చేసే వెలుసుబాటు రాజ్యాంగం ఏమైనా ఇచ్చిందా?..

ఆ రెండు జిల్లాల్లో పరిస్థితి ఏంటి?

సూర్యాపేట, నిర్మల్‌ జిల్లాల్లో చేసిన టెస్టుల సంఖ్యపై నిర్దిష్ట నివేదికలను సమర్పించాలని ఆ జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. మే నెలలో ఈ జిల్లాల్లోకి వచ్చిన వలస కార్మికుల లెక్కలు, వారికి చేసిన టెస్టుల వివరాలతో అఫిడవిట్లు ఇవ్వాలని సూచించింది. నిర్మల్‌లో 600 మందిని క్వారంటైన్‌లో ఉంచి, స్క్రీనింగ్‌ చేశామని చెప్పిన వివరాలు గందరగోళంగా ఉన్నాయని, వారిలో ఎందరికి కరోనా టెస్టులు చేశారో చెప్పలేదేమని తప్పుపట్టింది. నిర్మల్‌లో ఏప్రిల్‌ 22 నుంచి మే 22 వరకూ 49 టెస్టులు చేసినట్టు ఉందని, తర్వాత ఈ నెల 22 నాటికి 658 టెస్టులు చేసినట్టు ఉందని, పాజిటివ్​ వచ్చిందన్న 49 మంది గురించి స్పష్టత లేదని పేర్కొంది. సూర్యాపేటకు వలస కార్మికులు రావడం మొదలైన తర్వాత 35 శాంపిల్స్​ మాత్రమే తీసుకున్నామని చెప్పడాన్ని బట్టి అక్కడ ఎంత తక్కువగా టెస్టులు ఉన్నాయో స్పష్టం అవుతోందని పేర్కొంది.

కరోనా తీవ్రంగా ఉన్న టైంలో పూర్తి స్థాయిలో టెస్టులు చేయకుండానే రెడ్‌‌ జోన్‌‌ను గ్రీన్‌‌ జోన్‌‌గా మర్చేస్తరా? ఏమనుకుంటున్నారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గుండెపోటు సహా ఏ కారణంతో చనిపోయినా సరే.. సదరు మృతదేహాల నుంచి శాంపిల్స్​ సేకరించి టెస్టులు చేయించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఈ మేరకు చీఫ్​ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డితో కూడిన బెంచ్​ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వచ్చే నెల ఒకటో తేదీకి వాయిదా వేసింది.

ఇంత తక్కువ టెస్టులా?

సూర్యాపేటలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు ఉన్నప్పటికీ సర్కారు టెస్టులు చేయడం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్‌‌ రావు హైకోర్టులో పిల్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానితోపాటు కరోనా లక్షణాలతో చనిపోయినవారి బాడీల నుంచి శాంపిల్స్‌‌ సేకరించి టెస్టులు చేయాలంటూ మరికొందరు వేసిన పిల్స్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. మంగళవారం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారు తీరును తప్పుపడుతూ పలు కామెంట్లు చేసింది. ‘‘కరోనాకు మందు లేదు. ధనిక దేశాలు సైతం అల్లాడిపోతున్నాయి. తెలంగాణలో టెస్టులు చేస్తున్న తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. పక్కనే ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రతి పది లక్షల మందికి రెండు వేలకుపైగా టెస్టులు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం 518 టెస్టులే చేశారు. ఇది సరికాదు. వీలైనన్ని టెస్టులు ఎక్కువ చేయాలి..” అని హైకోర్టు పేర్కొంది.

మృతదేహాలకు టెస్టులు చేయండి

ఎవరైనా వ్యక్తి మృతికి కారణం తెలుసుకోకపోతే ప్రజల్లో భయాందోళనలు తీవ్రతరం అవుతాయని.. అసలు టెస్టులు చేయించడం వల్ల నష్టం ఏమిటో అర్థం కావడం లేదని హైకోర్టు పేర్కొంది. టెస్టుల్లో పాజిటివ్‌‌ గా తేలితే.. మృతుడి ఫ్యామిలీ, కాంటాక్ట్స్​కు కూడా టెస్టులు చేయకపోతే కరోనా ఎట్లా కట్టడి అవుతుందని ప్రశ్నించింది. మృతదేహాల నుంచి శాంపిల్స్‌‌ సేకరించి కరోనా టెస్టులు చేశాకే బంధువులకు అప్పగించాలని ఆదేశించింది. డెడ్​బాడీల నుంచి శాంపిల్స్​ తీసి టెస్టులు చేయాల్సిన అవసరం లేదని హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఏవిధంగా ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

టెస్టుల పూర్తి డీటైల్స్​ ఇవ్వండి

తెలంగాణ ఈ నెల ఒకటో తేదీ నుంచి 25వ తేదీ వరకూ నిర్వహించిన టెస్టుల వివరాలు, ప్రమాదకరంగా ఉన్న కేసుల్లో సెకండరీ కాంటాక్ట్స్​కు  టెస్టులు నిర్వహించిందీ లేనిదీ వివరించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని సూచించింది. రెడ్‌‌ జోన్​ ప్రాంతాలను ఆరెంజ్‌‌ జోన్లుగా, ఆరెంజ్‌‌ ను గ్రీన్‌‌ జోన్లుగా మార్చడానికి కారణాలను వివరించాలని స్పష్టం చేసింది.

ఎందుకింత నిర్లక్ష్యం?

కరోనా టెస్టులు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘కరోనా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ఎఫెక్ట్​ చూపుతోంది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలోనే ఏకంగా లక్ష మంది జనం మరణించారు. ధనిక దేశాలు కూడా అల్లాడుతున్నాయి. మరణాల రేటు పెరుగుతోంది. ఆ దేశాలతో పోలిస్తే మన దేశంలో వైద్య రంగం అభివృద్ధి చెందకపోయినా.. కనీసం కరోనా టెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నాన్చుడు వైఖరి అవలంబిస్తోంది. మృతుల సంఖ్య వెల్లడించడం ఆపేస్తున్నారనే అనుమానం కూడా వస్తోంది. దేశవ్యాప్తంగా టెస్టుల లెక్కలు చూస్తే తెలంగాణ బాగా తక్కువగా చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్రజారోగ్యం బాగున్నప్పుడే మంచి పాలన కొనసాగుతుందనే విషయాన్ని విస్మరిస్తే ఎలా? ఆర్థిక పరిస్థితుల కంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమని మర్చిపోకూడదు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వ అడుగులు ఉండాలి..” అని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున సమగ్ర నివేదిక దాఖలు చేయాలని అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ను ఆదేశించింది.

వలసలెక్కలన్నీ చెప్పండి

వలస కార్మికులకు టెస్టులు చేస్తే 118 మందికి పాజిటివ్​గా తేలిందని హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఎంతమంది వచ్చారు, ఎంత మందికి టెస్టులు చేశారనేది లేకుండా.. 118 మందికి కరోనా ఉన్నట్టు తేలిందంటే ఎలాగని నిలదీసింది. వివిధ రవాణా మార్గాల్లో తెలంగాణకు తిరిగొచ్చిన వలస కార్మికులు ఎందరు, వారిలో ఎందరికి టెస్టులు చేశారన్న వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

తెలంగాణలో సర్కార్ స్కీంలకు నోచుకోని లక్షమంది