
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ లోతేటి శివశంకర్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించాలంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును గురువారం హైకోర్టు సమర్థించింది. శివశంకర్‌ను ఏపీకి కేటాయించాలంటూ ఫిబ్రవరి 28న కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శివశంకర్‌ను తెలంగాణకు కేటాయిస్తూ 2024లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఏపీకి కేటాయించాలంటూ క్యాట్ వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర డీవోపీటీ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని హైకోర్టు విచారించింది. శివశంకర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా డీవోపీటి నిర్ణయం తీసుకుందని తెలిపారు. అధికారి పుట్టిన ప్రాంతం, చదువుకున్న, తండ్రికి చెందిన స్థలాలను పట్టించుకోకుండా కేవలం ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఇచ్చిన చిరునామాను ప్రాతిపదికగా తీసుకుని తెలంగాణకు కేటాయించిందని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం డీవోపీటీ పిటిషన్‌ను కొట్టివేసింది.