- దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విచారణకు బ్రేక్
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఆదేశాలిచ్చిన సుప్రీం కోర్టు.. ఇతర కోర్టుల్లో విచారణ నిలిపేయాలని ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టు విచారణకు బ్రేక్ పడింది. దిశ నిందితులను కావాలని ఎన్‌కౌంటర్ చేశారని మహిళా సంఘాల నేతలు, పౌర హక్కుల సంఘాల నేతలు హైకోర్టుకు లేఖలు రాశారు. వాటిని పిల్‌గా పరిగణిస్తూ సోమవారం విచారణ చేపట్టింది హైకోర్టు. నిందితుల డెడ్ బాడీలను ఈ నెల 13వ తేదీ వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రరపరచాలని ఆదేశించింది. విచారణను గురవారానికి వేసింది.
అయితే ఇవాళ మళ్లీ హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. కానీ, ఈ కేసులో సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ఎంక్వైరీకి ఆదేశించింది సుప్రీం కోర్టు. అయితే సుప్రీం ఆదేశించిన ఎంక్వైరీ ఉండగా ఇతర సంస్థల విచారణ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ అనడంతో.. సుప్రీం ఆ వాదనతో ఏకీభవించింది. ఇతర కోర్టులు, సంస్థ విచారణలను ఆపేయాలని ఆదేశించింది.
దీంతో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో తమ విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించిందని ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపింది. అయితే నిందితుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించే విషయంలపై సుప్రీం కోర్టే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాల్సి ఉందని చెబుతూ లాయర్ల వాదనలను నిలిపే.. విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
