హఫీజ్‌పేట్ భూములపై హైకోర్టు కీలక తీర్పు

హఫీజ్‌పేట్ భూములపై హైకోర్టు కీలక తీర్పు
  • హఫీజ్‌పేట్ ల్యాండ్స్ ప్రైవేట్‌‌వే
  • వివాదాస్పద భూములపై హైకోర్టు కీలక తీర్పు
  • రాష్ట్ర ప్రభుత్వం, వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదు
  • రికార్డుల మార్పు, గెజిట్ ఇవ్వడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌‌పేట్‌‌ వివాదాస్పద భూముల కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  సర్వే నెంబర్‌‌ 80లోని కోట్లాది రూపాయల విలువైన భూములు తమవేనని రాష్ట్ర సర్కార్, స్టేట్‌‌ వక్ఫ్‌‌బోర్డులు చేసిన వాదనలను కోర్టు కొట్టేసింది. ఆ భూములు ప్రైవేట్‌‌వేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అవి వక్ఫ్ భూములంటూ గతంలో ఇచ్చిన గెజిట్‌‌ను తప్పుబట్టిన న్యాయస్థానం.. సర్వే నంబర్ 80డీలోని 50 ఎకరాల భూములను నలుగురు పిటిషనర్ల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించాలని ఆదేశించింది. వారికి కోర్టు ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు సూచించింది. ఈ మేరకు హైకోర్టు మంగళవారం 78 పేజీల తీర్పును వెలువరించింది. 

వక్ఫ్ నామాలో అవకతవకలు..
హఫీజ్‌‌పేట్‌‌లోని ఆ భూములు 1955లో అమీరున్నిసా బేగం అనే మహిళ వక్ఫ్‌‌బోర్డుకు వక్ఫ్‌‌నామాగా దానం చేసిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే వక్ఫ్‌‌నామాలో ఆమె సంతకం లేకపోవడంపై న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఓ ప్రమాదం జరిగి ఆమె చేతులు కాలడం వల్ల సంతకం చేయలేదని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ తర్వాత జరిగిన భూలావాదేవీల్లో ఆమె సంతకం చేసి ఉండడాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా ప్రభుత్వ వాదనల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా వక్ఫ్‌‌నామా ఇచ్చిన ఆ మహిళకు ఈ భూమిపై యాజమాన్య హక్కు ఎలా సంక్రమించిందో కూడా ప్రభుత్వం కోర్టుకు చెప్పలేకపోయింది. అయితే ప్రభుత్వం జాగీర్దార్‌‌ వ్యవస్థ రద్దు కారణంగా ఆ భూమి తమదేనంటూ రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీ చేయడం, ఈ భూములపై ఎవరూ సూట్‌‌ వేసి క్లెయిమ్ చేయలేదు కాబట్టి తమ భూములేనని వాదన చేయడం చెల్లవని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. ఈ భూములపై కింది కోర్టులో ఫైనల్‌‌ డిక్రీ 2006లోనే వచ్చింది. భూయాజమాన్య హక్కులపై 2013 నవంబర్‌‌లో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి అధికారం లేదని తేల్చింది. అయినా ఓల్డ్‌‌ వక్ఫ్‌‌ బోర్డు యాక్ట్‌‌ ప్రకారం 2013 డిసెంబర్‌‌లో హఫీజ్‌‌పేట్‌‌లోని సర్వే 80లోని 140 ఎకరాలు తమవేనంటూ వక్ఫ్ బోర్డు తీర్మానం చేసింది. ఆ భూమిని దర్గా హజ్రత్‌‌ సలా-యీ అయులియాకు అప్పగించింది. దీనికి అనుగుణంగా 2014 నవంబర్ 1న ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అయితే సుప్రీం తీర్పు తర్వాత వక్ఫ్ బోర్డు తీర్మానం, ప్రభుత్వం గెజిట్ జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.

నలుగురు పిటిషనర్ల పేరున 50 ఎకరాలు..
ఇకపై ఈ సర్వే 80లోని భూమి తమదేనని ప్రభుత్వం, వక్ఫ్‌‌బోర్డులు ప్రయత్నం చేయకూడదని ధర్మాసనం తీర్పులో వెల్లడించింది. రెవెన్యూ, ముంతకాబ్‌‌ రికార్డుల్లో ప్రభుత్వ/వక్ఫ్‌‌బోర్డుల భూమేనని చేసిన ఎంట్రీని రద్దు చేయాలని ఆదేశించింది. ఈ భూముల క్రయవిక్రయాలు చేయకూడదని గతంలో వక్ఫ్‌‌ బోర్డు రాసిన లేఖ చెల్లుబాటు కాదని రెవెన్యూ శాఖకు స్పష్టం చేసింది. సర్వే నెంబర్‌‌ 80లోని భూమిని ఏబీసీడీలుగా విభజించి, సర్వే 80డీలోని 50 ఎకరాలను ప్రవీణ్‌‌ కుమార్‌‌ ఇతర యజమానుల పేర్లతో రికార్డుల్లో చేర్చాలని సూచించింది. తీర్పు కాపీని అందుకున్న 4 వారాల్లోగా తమ ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌‌ చేస్తామని అదనపు ఏజీ చెప్పారు.