ఏ అధికారంతో నోటిఫికేషన్ ఇచ్చిన్రు?.. లేక్ ప్రొటెక్షన్ కమిటీపై హైకోర్టు ఫైర్​

ఏ అధికారంతో నోటిఫికేషన్ ఇచ్చిన్రు?.. లేక్ ప్రొటెక్షన్ కమిటీపై హైకోర్టు ఫైర్​

హైదరాబాద్, వెలుగు: చెరువుల బఫర్ జోన్లను నోటిఫై చేయడంలో జరుగుతున్న జాప్యంపై శుక్రవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2010లో చెరువుల పరిరక్షణ కమిటీ ఏర్పాటైనా.. ఇప్పటికీ చెరువుల బఫర్ జోన్లను గుర్తించకపోవడాన్ని తప్పుపట్టింది. రామమ్మకుంట బఫర్ జోన్ పరిధిలో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థ భవనం నిర్మాణ పనులను సవాల్​ చేస్తూ హ్యూమన్ రైట్స్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ వేసిన పిల్​ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ లతో కూడిన బెంచ్​ శుక్రవారం విచారించింది. లేక్ ప్రొటెక్షన్ కమిటీ తరఫు లాయర్​ వాదనలు వినిపిస్తూ.. బఫర్ జోన్ల గుర్తింపు ప్రక్రియ మొదలైందని, ప్రస్తుతం 230 చెరువుల బఫర్ జోన్లు గుర్తించినట్లు తెలిపారు.

 హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని, 2,407 చెరువులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. దీంతో బెంచ్​జోక్యం చేసుకొని.. ‘ఏ చట్టం కింద ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. సెక్షన్ 4 కింద ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు స్వీకరించడానికి ఇది భూసేకరణ చట్టం కాదు. ఏ అధికారంతో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. నీటిపారుదల శాఖతో హెచ్ఎండీఏ ఎందుకు సంప్రదించలేదు. నీటికి సంబంధించి జియోట్యాగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు..’ అని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించింది.  ఇదే చివరి అవకాశం అని తేల్చి చెప్పి.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా  వేసింది..