ఓల్డేజ్ హోమ్స్, అనాథాశ్రమాలను అధికారులకు ఎందుకు పట్టించుకోవడం లేదు? చిరిగిన దుప్పట్లు, దుమ్ముతో పేరుకు పోయిన పరుపులు, విరిగిన కిటికీలు, పట్టని తలుపులతో నడిపిస్తున్నారు. ఇలాంటి ఓల్డేజ్ హోంలలో అధికారులు మూడు నాలుగు రోజులు నివాసం ఉంటే, అప్పుడు వాళ్ల కష్టాలు అర్థమవుతయ్.. – హైకోర్ట్
ఓల్డేజ్ హోంలు దయనీయంగా ఉన్నాయని కోర్టు నియమించిన అమికస్ క్యూరీ న్యాయవాది వసుధా నాగరాజ్ ఇచ్చిన రిపోర్టు చూసి కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దారుణం, ఘోరం, దుర్భరం.. ఇలాంటి పదాలేవీ సరిపోనట్లుగా ఓల్డేజ్ హోం లు ఉన్నాయని రిపోర్టు స్పష్టం చేస్తోందని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిల డివిజన్ బెంచ్ అభిప్రాయ పడింది. స్త్రీ,శిశు సంక్షేమ, సోషల్ వెల్‌ఫేర్ డిపార్ట్ మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ నగరంలోని మమత వృద్ధాశ్రమంలోని దారుణ పరిస్థితులపై స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాసిన లెటర్‌ను హైకోర్టు పిల్‌గా స్వీకరించి విచారణ చేపట్టింది. అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోంలలో ఉన్నది పేదోళ్లు. వాళ్లు మాట్లాడలేని దుస్థితి. ఇలాగే ఉంటారని అనుకోవద్దు. వాళ్లకూ హక్కులున్నాయి. అధికారులకు, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఈ విషయంలో ఎవరైనానిర్లక్ష్యంగా ఉంటే హైకోర్టు చూస్తూ కూర్చోదని బెంచ్ హెచ్చరించింది.
మీరు వెళ్లకుంటే మేమే వెళ్తం..
ఉన్నతాధికారులు ఆ హోంలకు వెళ్లి స్వయంగా సమస్యలను తెలుసుకోవాలని కోర్టు ఆదేశించింది. అధికారులు మీన మేషాలు లెక్కిస్తే తామే వెళ్లి పరిస్థితులను పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామంది. రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో రిజిస్టరైనవి, చేయనవి ఎన్ని హోమ్స్ ఉన్నాయో తేల్చాలని, వాటిలోని వసతులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీళ్లకోసం వెంటనే హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి మీడియాలో బాగా ప్రచారం చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆయా పీఎస్‌ల ద్వారా విచారించి, చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 3 గదుల్లో 24 మంది వృద్ధులున్నారని, నడిచేందుకు దారి లేకుండా మరుగుదొడ్లు లేకుండా నిర్వహిస్తున్నారనే రిపోర్టును చదివిన కోర్టు తల్లడిల్లింది. మదర్స్ హోంలో 3 గదుల్లో24 మంది ఉన్నారని, ఇంకో హోంలో మంచాల మధ్య నడిచే గ్యాప్ లేదని కోర్టు చెప్పింది. విచారణను 23కి వాయిదా వేసింది.
మరిన్ని వార్తల కోసం
రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్

