కరోనా వైరస్‌పై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ బుధవారం ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. పిటిషినర్ వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజల కోసం ఫ్రీగా మాస్కులు, మందులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా అరికట్టడం కోసం అధికారులు చేస్తున్న పని తీరుపై హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉచితంగా మందులు, మాస్కులు అందజేయాలని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. సామాన్యులను దృష్టిలో పెట్టుకొని సర్కార్ పనిచేయాలని కోర్టు సూచించింది. కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై నివేదికను కోర్టుకు సమర్పించింది. రాష్ట్ర, జిల్లాస్థాయిలలో కమిటీలని నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మురికివాడలలో ఆయాలను, హెల్త్ వర్కర్స్‌ని నియమించినట్లు తెలిపింది. పదిమందితో కూడిన వైద్యుల బృందం కేరళకు వెళ్లిందని వైద్యాధికారులు హైకోర్టుకు తెలిపారు. సిబ్బందికి ఉచితంగా మాస్కులు ఇవ్వడంతో పాటు ఎక్కువసార్లు చేతులు కడుక్కోవాలని ఎప్పటికప్పుడు సూచిస్తున్నామని సర్కార్ తెలిపింది. మురికివాడల్లో చేతులు కడుక్కోవడానికి పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నారా? లేదా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సభలు, సమావేశాలకు పోలీసులు ఆలోచించి అనుమతి ఇవ్వాలని సూచించింది. లాయర్లు కూడా మాస్కులు ధరించి కోర్టుకు రావాలని కోరింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
For More News..
