
- ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పెన్షన్ సర్వీస్ ప్రారంభమవుతుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తాత్కాలిక సర్వీస్‌ను కూడా పెన్షన్ చెల్లింపులకు పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టెంపరరీ ఎంప్లాయీ తాత్కాలిక సర్వీస్‌ను కూడా లెక్కించి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని సూచించింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని పెన్షన్ ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ అమలుకు సర్వీస్ లెక్కింపులో తమకు ఉన్న తాత్కాలిక సర్వీసును పరిశీలించలేదంటూ హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా చేసిన డాక్టర్ సి.నిర్మలతో పాటు మరో 51 మంది దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ జరిపారు.
1980లో సవరించిన పెన్షన్ నిబంధనలు 13, 14 ప్రకారం టెంపరరీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే పెన్షన్ సర్వీసు ప్రారంభమవుతుందన్నారు. కాబట్టి పెన్షన్ ప్రయోజనాల లెక్కింపులో టెంపరరీ సర్వీసును కూడా లెక్కించాలని తీర్పు వెలువరించారు. తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది సీహెచ్ గణేశ్ వాదిస్తూ పిటిషనర్లు 2002 నుంచి 2006 వరకు కాంట్రాక్ట్ సర్వీసు కింద ఉద్యోగం చేశారని, అయితే పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్లతో సమానంగా ఇవ్వలేదన్నారు.
టెంపరరీ సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఇదే హైకోర్టు గతంలోనే తీర్పు చెప్పిందని ప్రస్తావించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఏపీ, తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన తీర్పు, ఆపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆఫీసర్లు పరిగణనలోకి తీసుకుని పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఆదేశించారు. పిటిషన్లపై విచారణ ముగిసిందని తెలిపారు.