మీ సొంత విచక్షణ అనవసరం .. వైవీ. స్వర్ణలత పిటిషన్‌‌లో పోలీసులకు హైకోర్టు ఆదేశం

మీ సొంత విచక్షణ అనవసరం .. వైవీ. స్వర్ణలత పిటిషన్‌‌లో పోలీసులకు హైకోర్టు ఆదేశం
  • చట్టప్రకారం చర్యలు తీసుకోండి

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌‌లోని భూ వివాదంలో చట్టాన్ని పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కాంపిటెంట్‌‌ కోర్టు ఇచ్చిన ఇంజక్షన్‌‌ ఉత్తర్వులను పాటించనప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉత్తర్వులను ఉల్లంఘించినట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పుడు పోలీసులు సొంత విచక్షణతో వ్యవహరించలేరని తేల్చిచెప్పింది. పిటిషనర్‌‌ ఫిర్యాదును పరిశీలించి, చట్టప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

 కొండాపూర్‌‌లోని సర్వే నంబర్‌‌ 87/2లోని 6.23 ఎకరాల చుట్టూ ఉన్న రెండెకరాల వివాదంలో ప్రైవేట్‌‌ వ్యక్తులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌‌సీపీ నేత వైవీ. సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. పక్షపాతంతో వ్యవహరిస్తున్న మాదాపూర్‌‌ డీసీపీ, ఏసీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌‌ను జస్టిస్‌‌ జె. శ్రీనివాస్‌‌రావు విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది వినోద్‌‌కుమార్‌‌ దేశ్‌‌పాండే, రోహిత్‌‌ పోగుల వాదనలు వినిపించారు. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలున్న ప్రైవేట్‌‌ వ్యక్తులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. 

కాంపిటెంట్‌‌ కోర్టు పిటిషనర్‌‌కు అనుకూలంగా ఇంజక్షన్‌‌ ఉత్తర్వులు జారీ చేసిందని, హైకోర్టు కూడా ప్రైవేట్‌‌ వ్యక్తి అప్పీల్‌‌ను తోసిపుచ్చిందని చెప్పారు. ప్రైవేట్‌‌ వ్యక్తులపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, భూమిని స్వాధీనం చేసుకోవడానికి వారికి మద్దతు ఇస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. చట్టానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కౌంటర్‌‌ దాఖలు చేయాలని ప్రైవేట్‌‌ పార్టీని ఆదేశిస్తూ, విచారణ జూన్‌‌కు వాయిదా వేశారు.