
- వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం
- గ్రూప్ 1 కేసులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. నియామకాలన్నీ నిలిచిపోయాయని, తమ వాదనలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.
దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. మధ్యంతర ఉత్తర్వుల రద్దు, సవరణ తదితర ఏదైనా సింగిల్ జడ్జినే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. అప్పీల్ పిటిషన్‌పై విచారణ ముగిసిందని ప్రకటించింది.