పీపీల భర్తీపై నోటిఫికేషన్‌ వివరాలివ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

పీపీల భర్తీపై నోటిఫికేషన్‌ వివరాలివ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామక నోటిఫికేషన్‌ను వారంలో తమ ముందుంచాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీ పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాల్​చేస్తూ హైదరాబాద్‌కు చెందిన బి. శ్రీనివాసులు హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై చీఫ్​ జస్టిస్ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది. 

ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..118 ఏపీపీ పోస్టుల నియామకానికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, త్వరలోనే నోటిఫికేషన్‌ జారీచేయనున్నామని తెలిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సుమారు 262 పోస్టులు ఖాళీగా ఉండగా 118 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇస్తున్నామని చెబుతున్నారన్నారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు నోటిఫికేషన్‌ ఇస్తున్నట్టు చెప్పినా ఇవ్వలేదని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం నోటిఫకేషన్‌ను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వారానికి వాయిదా వేసింది.