పిల్లల మిస్సింగ్‌‌ కేసుల పురోగతిపై వివరాలివ్వండి.. సర్కారుకు హైకోర్టు ఆదేశం

పిల్లల మిస్సింగ్‌‌ కేసుల పురోగతిపై వివరాలివ్వండి.. సర్కారుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు, వాటి పురోగతిని వివరించాలని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిల్లల అక్రమ రవాణా, బలవంతంగా బెగ్గింగ్‌‌లోకి దించే ముఠాలు, లైంగిక వేధింపుల నివారణకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని చీఫ్‌‌ సెక్రటరీ, డీజీపీ, ఉమెన్‌‌ అండ్‌‌ చైల్డ్‌‌ వెల్‌‌ఫేర్, హోం శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. 

పిల్లల మిస్సింగ్ పై ఇంగ్లిషు పత్రికలో వచ్చిన స్టోరీని హైకోర్టు పిల్‌‌గా పరిగణించింది. దీనిని జస్టిన్‌‌ అలోక్‌‌ అరాథే, జస్టిస్‌‌ జె. అనిల్‌‌ కుమార్లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది. రోజుకు పది మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారని, ఇప్పటికీ నాలుగు వేలమంది ఆచూకీ తెలియడం లేదని కథనం వెల్లడించింది. 2022లో 854 మంది అదృశ్యమైతే అందులో 391 మంది ఆడపిల్లలున్నారని, పిల్లల మిస్సింగ్‌‌లో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో ఉందని పేర్కొంది. ఈ అంశాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా పడింది.