అక్రమ నిర్మాణాలను ఎందుకు పట్టించుకుంటలేరు?..మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన హైకోర్టు

అక్రమ నిర్మాణాలను ఎందుకు పట్టించుకుంటలేరు?..మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన హైకోర్టు
  • ఇల్లీగల్ కన్​స్ట్రక్షన్లతో వసూళ్ల దందా చేస్తున్నారని సీరియస్
  • వాటితో భవిష్యత్తు తరాలకు ముప్పు అని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సరైన పార్కింగ్, నీరు, మురుగునీటి వసతుల్లేకుండా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తరాలకు ముప్పు పొంచి ఉందని హైకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలను మున్సిపల్‌‌  అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. వాటిని అడ్డం పెట్టుకుని వసూళ్ల పర్వం కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. మేడ్చల్‌‌  మల్కాజిగిరి జిల్లా ఘట్‌‌కేసర్  మండలం పార్వతిపురంలో సర్వే నంబర్ 17లోని 175 చదరపు గజాల్లో అనుమతుల్లేకుండా చేపట్టిన నిర్మాణంపై వినతిపత్రం ఇచ్చినా మున్సిపల్‌‌ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బి.సంజీవ్‌‌ కుమార్‌‌.. హైకోర్టులో పిటిషన్‌‌  దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్‌‌  బి.విజయ్‌‌ సేన్‌‌ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలతో పార్కింగ్‌‌ కు స్థలం ఉండడం లేదని, రోడ్లు కుచించుకుపోతున్నాయని అన్నారు. నగరంలో ఒక్క ఇంటి దగ్గర కూడా ఇరుగుపొరుగు మధ్య సత్సంబంధాలు లేవని వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తు భయానకంగా ఉంటుందన్నారు. అడ్డదారుల్లో సంపాదించాలన్న లక్ష్యంతో ప్రజలు కొత్తకొత్త ఆలోచనలు చేస్తున్నారన్నారు. 175 చదరపు అనుమతులకు విరుద్ధంగా 4 అంతస్తులు నిర్మించడంపై ఫొటోలు ఉన్నాయని, ఇలా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. 

పిటిషనర్‌‌తో పాటు అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తి అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంతో ఆస్తి వివాదాలతో అక్రమ నిర్మాణాలపై ఎలా ఫిర్యాదు చేస్తారని నిలదీశారు. అక్రమ నిర్మాణం విషయాన్ని మున్సిపాలిటీ చూసుకుంటుందని, సోదరుడికి ఒక అంతస్తు ఎందుకు ఇవ్వరాదని ప్రతివాదిని ప్రశ్నించారు. అన్నదమ్ములు ఇద్దరు హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను  వాయిదా వేశారు.