ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని ఎందుకు అడ్డుకుంటలేరు?

ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని ఎందుకు అడ్డుకుంటలేరు?
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
  • సీటీ స్కాన్, టెస్ట్‌‌‌‌లు, పీపీఈ కిట్ల రేట్లపై జీవో ఇవ్వాలని ఆదేశం
  • థర్డవేవ్​ వస్తే  మీ ప్రణాళికలు, వ్యూహాలేంటో తెలపాలి
  • చర్యలపై పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కోరిన ఏజీ
  • ఎన్ని వాయిదాలు కోరతారంటూ హైకోర్టు అసహనం

హైదరాబాద్, వెలుగు: ‘కరోనా సెకండ్ వేవ్​కంటే థర్డ్​వేవ్​మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్నాయి. థర్డ్​వేవ్​కరోనా నియంత్రణకు ప్రభుత్వం దగ్గరున్న ప్రణాళికలు, వ్యూహాలు ఏమిటి?  ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రుల దోపిడీని అరికట్టే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు ఎందుకు ఇవ్వడం లేదు? డైలీ లక్ష టెస్ట్‌‌‌‌లు చేయాలని అనేకసార్లు ఆదేశించినా ఇప్పటివరకు ప్రభుత్వానికి పట్టడం లేదు. విపత్తుల నిర్వహణలో భాగంగా కమిటీలు వేయాలంటే ఆవి ఏమయ్యాయో చెప్పడం లేదు. శ్మశానాల్లో ఎన్ని డెడ్‌‌‌‌ బాడీలకు అంత్యక్రియలు చేశారో కూడా తెలపడం లేదు. ఇలానే ఎన్నో అంశాలపై ప్రభుత్వ నుంచి చర్యలు లేవు..’ అని హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా, లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ నేపథ్యంలో గతేడాది దాఖలైన రెండు పిల్స్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ హిమా కోహ్లి, జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ సోమవారం మరోసారి విచారణ జరిపింది. పూర్తి వివరాల సమర్పించేందుకు గడువు కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్​జనరల్​బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ కోరడాన్ని తప్పుపట్టింది. ‘ఎన్నిసార్లు వాయిదాలు కోరతారు. ఇది ప్రజారోగ్యానికి చెందిన పిల్‌‌‌‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి..’ అని కోర్టు తేల్చి చెప్పింది. మూడు గంటల పాటు సావధానంగా పిల్స్‌‌‌‌ను విచారించింది. పూర్తి వివరాల కోసం విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది.

48 గంటల్లో మళ్లీ జీవో ఇవ్వాలె.. 
ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రుల దోపిడీని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. ‘కార్పొరేట్‌‌‌‌ ఆస్పత్రులను నియంత్రించాలి. సిటీస్కాన్, బ్లడ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు, పీపీఈ కిట్లు వంటివి ఇప్పుడు కరోనా వైద్య పరీక్షల్లో తప్పనిసరి. వీటి ధరలపై గతంలోని ఇచ్చిన జీవోలకు కాలం చెల్లింది. మళ్లీ జీవోను 48 గంటల్లో జారీ చేయాలి. జీవోను అన్ని ఆస్పత్రుల్లో మెయిన్‌‌‌‌ నోటీస్‌‌‌‌ బోర్డుల్లో పెట్టాలి. టీవీలు, పత్రికల్లో ప్రచారం కల్పించాలి. ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రులపై ఫిర్యాదుల పర్యవేక్షణకు ఐఏఎస్‌‌‌‌లతో కూడిన గ్రీవెన్స్‌‌‌‌ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి బాధి తులు ఫిర్యాదు చేయడానికి వీలుగా టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌ ఏర్పాటు చేయాలి..’ అని కోర్టు ఆదేశించింది.

వారికి బకాయిలతో పాటు జీతాలివ్వాలె
ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లల్లో 500 మందికి కరోనా పాజిటివ్‌‌‌‌ వచ్చిందని, వారిలో 15 మంది మరణించారని న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘మరణించిన వాళ్ల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. బాధితులకు ట్రీట్​మెంట్​ఇవ్వాలి..’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటు వైద్య శాఖలో పనిచేసే ఔట్‌‌‌‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు జీతాలు చెల్లింపులు ఆగిపోయాయని పత్రికల్లో వచ్చిన  కథనాలపై తీవ్రంగా స్పందించింది. ‘ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు.  వెంటనే వాళ్ల జీతాల్ని బకాయిలతో చెల్లించాలి. పలు ఎన్‌‌‌‌జీవోలు ముందుకు వస్తున్నందున వాటి సహకారంతో వ్యాక్సినేషన్‌‌‌‌ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్, వరంగల్‌‌‌‌ లాంటి సిటీల్లో వ్యాక్సినేషన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ చేపట్టాలి. దివ్యాంగులు, జైళ్లల్లోని ఖైదీలు, అనాథలు, నిరాశ్రయులకు వ్యాక్సినేషన్‌‌‌‌ గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. అన్ని జిల్లాల్లోనూ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటుకు వీలుగా 48 గంటల్లో ప్రభుత్వం జీవో జారీ చేయాలి. కరోనా బాధితులకు, హోం క్వారంటైన్‌‌‌‌లో ఉన్న వాళ్లకు కనీస ధరకు లేదా ఉచితంగా భోజనం పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి..’ అని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

నెల క్రితమే లక్ష టెస్ట్‌‌‌‌లు చేయాలని చెప్పాం..
ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ల సంఖ్య ఎందుకు పెంచడం లేదో ఇప్పటికీ అర్థం కావడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అది పిల్లలపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దశలో ముందే మనం మేల్కొవాలి. రెండో దశ ఆదిలోనే సుమారు నెల క్రితమే ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు డైలీ లక్ష వరకూ చేయాలంటే ప్రభుత్వం చేయడం లేదు. ఎవరికి కరోనా ఉందో తెలియకపోతే కట్టడి ఎలా సాధ్యం? ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌ సెంటర్స్‌‌‌‌ 14 ఏర్పాటు చేసేందుకు గత నెలలో అడిగిన గడువు ఈ నెల 15తో ముగిసింది. అయినా వాటి ఆచూకీ తెలియడం లేదంటే ఏమనుకోవాలి..?’ అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.