కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు ఎదురుదెబ్బ

కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు ఎదురుదెబ్బ
  • కేసును సీబీఐకి  అప్పగించొద్దన్న వినతిని తోసిపుచ్చిన హైకోర్టు
  • మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ
  • కేసు మెరిట్స్​లోకి వెళ్లడం లేదని వెల్లడి
  • కమిషన్ నివేదికపై ఏం చేయబోతున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఎదురుదెబ్బ తగిలింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం.. ఈ వ్యవహారం సీబీఐకి అప్పగిస్తామని ప్రకటించిందని, వెంటనే జోక్యం చేసుకోవాలని అడ్వకేట్లు కోరగా.. డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ మేరకు కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఘోష్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ నివేదికపై ప్రభుత్వం ఏం చేయబోయేదీ వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. 

రిపోర్టుపై చర్యలు తీసుకున్నారా? లేక చర్యలు తీసుకుంటారా? ఈ రెండూ కాకపోతే ఏ దశలో నిర్ణయం ఉందో మంగళవారం జరిగే విచారణలో తెలియజేయాలని ఆదేశించింది. రిపోర్టును అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం.. ఈ వ్యవహారం సీబీఐకి అప్పగిస్తామని ప్రకటించిందని, వెంటనే న్యాయస్థానం జోక్యం చేసుకోకపోతే జీవో వెలువడే అవకాశం ఉందని కేసీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు తరఫు అడ్వకేట్లు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం వరకు సీబీఐకి అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరగా, అందుకు డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ నిరాకరించింది. కనీసం తమ అనుబంధ పిటిషన్లను మధ్యాహ్నం 2.30 గంటలకు వినాలని, అప్పటిలోగా ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని ఆదేశించాలంటూ అడ్వకేట్లు కోరినా ఫలితం లేకుండా పోయింది. 

ఇప్పుడు తాము కేసు మెరిట్స్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లడం లేదని, ప్రభుత్వ నిర్ణయం తెలుసుకున్నాకే తాము స్పందిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జీఎం.మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌ తో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నివేదికపై ప్రభుత్వం పోలీస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌ 62 కింద సీబీఐ దర్యాప్తునకు జీవో జారీ చేస్తే పిటిషన్‌‌‌‌‌‌‌‌ల లక్ష్యం నీరుగారుతుందని అడ్వకేట్లు చేసిన వినతిని తోసిపుచ్చింది.

సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: అడ్వకేట్లు

కమిషన్‌‌‌‌‌‌‌‌ విచారణ నివేదిక అమలును నిలిపివేయాలంటూ కేసీఆర్, హరీశ్ రావు వేర్వేరుగా హైకోర్టులో అనుబంధ పిటిషన్లు (ఐఏ) వేశారు. సుప్రీం కోర్టు సీనియర్‌‌‌‌‌‌‌‌ అడ్వకేట్లు ఆర్యమ సుందరం, దామ శేషాద్రి నాయుడు వాదించారు. పోలీస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌ 62 కింద సీబీఐ దర్యాప్తునకు జీవో జారీ కావొచ్చని చెప్పారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీలో విపక్ష సభ్యులు సలహాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా కమిషన్‌‌‌‌‌‌‌‌ నివేదిక ఆధారంగా చర్యలు తప్పవని ప్రకటించారని తెలిపారు.

 ఈ మేరకు ఆ ప్రకటనలను ఇంగ్లిషులోకి అనువాదం చేసిన కాపీలను బెంచ్‌‌‌‌‌‌‌‌కు అందజేశారు. సీబీఐ దర్యాప్తునకు అసెంబ్లీ తీర్మానం చేయలేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సీఎం ప్రకటించారని చెప్పారు. సీఎం రాజకీయ కక్షతో ఉన్నారని, ఈ దశలో స్టే ఇవ్వకపోతే కేసు మొత్తం నిరుపయోగం అయినట్టేనని చెప్పారు. గత విచారణ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీకి విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని వివరించారు. రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టాకే తదుపరి చర్యలు ఉంటాయని ఏజీ హామీకి విరుద్ధంగా జరుగుతున్నదని తెలిపారు. పిటిషనర్ల ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. 

హైకోర్టు కల్పించుకుని.. ఇదంతా పిటిషనర్ల ఆందోళన మాత్రమేనని తెలిపింది. మధ్యాహ్నమే విచారణ జరపాలని అడ్వకేట్లు కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని అడ్వకేట్ జనరల్‌‌‌‌‌‌‌‌ వాదించేందుకు మంగళవారం లేదా బుధవారానికి విచారణ వాయిదా వేయాలని కోరారు. దీంతో హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ దశలో కూడా పిటిషనర్ల న్యాయవాదులు జోక్యం చేసుకుని, మంగళవారం విచారణ జరిగే వరకైనా సీబీఐకి అప్పగించకుండా స్టే ఇవ్వాలని కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. అన్ని అంశాలను మంగళవారం జరిగే విచారణలో ప్రభుత్వ వైఖరి తేలిన తర్వాతే తేల్చుతామని ప్రకటించింది.