విచారణ ఎదుర్కోవాల్సిందే..కేసు కొట్టేయడానికి లేదు: హైకోర్టు

విచారణ ఎదుర్కోవాల్సిందే..కేసు కొట్టేయడానికి లేదు: హైకోర్టు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చుక్కెదురు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేత పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై కమలాపురం పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో నమోదైన కేసు కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌పై సెక్షన్‌‌‌‌‌‌‌‌ 188 నమోదు చేయడాన్ని హైకోర్టు రద్దు చేసింది. కేసు విచారణ మాత్రం ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పింది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న కేసును కొట్టివేయాలన్న అభ్యర్థన ఆమోదయోగ్యం కాదని జస్టిస్‌‌‌‌‌‌‌‌ కే.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ సోమవారం తీర్పు వెలువరించారు.

తనకు ఓటేసి గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని, అప్పుడు ఓటర్లు తన శవయాత్రకు రావాలని, ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ యాత్రకు వస్తానని ఓటర్లను పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి బెదిరించారంటూ నోడల్‌‌‌‌‌‌‌‌ అధికారి (ఎంపీడీవో) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కమలాపురం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి తరఫు అడ్వకేట్ టీవీ రమణ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. పోలీసులు దర్యాప్తు జరిపి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారని తెలిపారు. ఈ కేసు ఒక రాజకీయ కుట్ర అని వాదించారు.

తన క్లయింట్​పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దాన్ని కోర్టుకు ఇవ్వలేదన్నారు. పోలీసుల వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేశారని, ఐదుగురు సాక్షులూ ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పారు. ఫిర్యాదు చేసింది.. విచారణ చేపట్టింది కూడా అధికారులేనని వివరించారు. ఒక్క ఓటరు కూడా సాక్షిగా లేరన్నారు. కేసు కొట్టేయడానికి వీల్లేదని పోలీసుల తరఫున పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌ పల్లె నాగేశ్వరరావు వాదించారు. ఈ పిటిషన్​పై ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు గత ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 22న తీర్పును వాయిదా వేసి తాజాగా వెలువరించింది.