
- తీర్పు వెలువరించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: దేవాలయ భూములకు సంబంధించి హక్కులు దేవాలయానివా? పూజారివా అన్న వివాదాన్ని తేల్చాల్సింది ఎండోమెంట్ ట్రిబ్యునల్ మాత్రమేనని హైకోర్టు స్పష్టం చేసింది. దేవాలయ భూములపై తమ పూర్వీకుల నుంచి వచ్చిన హక్కులను తొలగిస్తూ కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, నరసింహాచార్యులు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..పిటిషనర్ల తండ్రి నరహరచార్యులకు 10.31 ఎకరాలు, పిటిషనర్ శ్రీనివాసాచార్యుల పేరుతో 3.39 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు.
అయితే, పిటిషనర్ల పేర్లతోపాటు పట్టాదారుల కాలమ్‌లో శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల పేర్లు ఉన్నాయని వెల్లడించారు. రికార్డుల్లో ఆలయాల పేర్లను తొలగించి, పిటిషనర్ల పేర్లను ఉంచాల్సిన అధికారులు పొరపాటున పిటిషనర్ల పేర్లను తొలగించారని కోర్టుకు తెలిపారు. మళ్లీ పిటిషనర్ల పేర్లను నమోదు చేసి పాస్‌బుక్‌లు జారీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దేవాదాయశాఖ తరఫు న్యాయవాది భూక్యా మంగీలాల్ నాయక్ వాదిస్తూ..పిటిషనర్ల పూర్వీకులు ఆలయాలకు పూజారిగా పేర్కొంటూ సాగు కోసం భూమిని అప్పగించారన్నారు.
అంతమాత్రాన ఆలయ భూమి పూజార్లది కాదని తెలిపారు. ఆధారాలేవైనా ఉంటే దేవాదాయ చట్ట నిబంధనల ప్రకారం ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చన్నారు. కోర్టు స్పందిస్తూ..భూమి రకం, వర్గీకరణ, విస్తీర్ణం, హక్కుల వివాదాన్ని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని తెలిపింది. దేవాదాయ చట్టం కింద ఏర్పాటైన ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఈ వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని వెల్లడించింది. పిటిషనర్లు తగిన ఆధారాలతో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలంటూ విచారణను ముగించింది.