కష్టకాలంలో రేట్లు కంట్రోల్ చేయకపోతే ఎలా?

కష్టకాలంలో రేట్లు కంట్రోల్ చేయకపోతే ఎలా?

లాక్ డౌన్ లో అధిక ధరలపై హైకోర్టు మండిపాటు
సర్కారు నివేదికపై అసంతృప్తి
26 లోగా కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ టైమ్ లో నిత్యావసరాల ధరలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విపత్కర సమయంలో ప్రజలు దోపిడీకి గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, ప్రేక్షక పాత్ర వహించడం సరికాదంది.  హైదరాబాద్ లో నిత్యావసరాలు, కూరగాయల రేట్లు పెరిగాయంటూ మార్చి 24న ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన స్టోరీని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. రేట్లను అదుపు చేశామని, 290 మందిపై కేసులు పెట్టామని ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ పై బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ద్వారా తెప్పించుకున్న రిపోర్ట్ ప్రకారం నిత్యావసరాలు, కూరగాయల రేట్లు పెరిగాయని.. నమోదు చేసిన కేసుల సంఖ్య నామమాత్రంగా ఉందని చెప్పింది.

‘రేట్లను కంట్రోల్‌ చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. కేసుల నమోదు రాజధానికే పరిమితం అయ్యింది, మొత్తం రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదు. ప్రజలను అధిక ధరలతో దోపిడీ చేస్తుంటే చర్యలు తీసుకున్నదీ లేనిదీ తెలియజేయాలి కదా? నల్గొండ, మహబూబ్‌‌నగర్, వరంగల్, కరీంనగర్‌‌ తదితర జిల్లాలు రాష్ట్రంలో అంతర్భాగమే కదా’ అని మండిపడింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. అధిక రేట్లకు నిత్యావసరాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశాలిచ్చారని తెలిపారు. చర్యలు త్వరగా చేపట్టకపోతే నష్టపోయేది సామాన్యుడనే విషయాన్ని మరిచిపోకూడదని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌‌డౌన్‌‌ వల్ల ప్రజలు ఎక్కడికీ వెళ్లలేరన్న బలహీనతను అడ్డంపెట్టుకుని అధిక ధరలకు అమ్ముతుంటే నియంత్రించకపోతే ఎలా అని ప్రశ్నించింది. ప్రభుత్వం తీరు ఇలానే ఉంటే తాము చూస్తూ ఉండబోమని ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నెల 26లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను 27కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి