ఇల్లీగల్​గా బిల్డింగ్స్‌‌‌‌ కడుతుంటే ఆఫీసర్లు నిద్రపోతున్నరా?

ఇల్లీగల్​గా బిల్డింగ్స్‌‌‌‌ కడుతుంటే ఆఫీసర్లు నిద్రపోతున్నరా?

హైదరాబాద్, వెలుగు: ‘‘సర్కారీ జాగాల్లో ఎంక్రోచ్‌‌‌‌మెంట్స్(అక్రమంగా చొరబడటం), ఇల్లీగల్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ వెలుస్తుంటే ఆఫీసర్లు అడ్డుకోకుండా నిద్రపోతున్నారా? ఎంక్రోచ్‌‌‌‌మెంట్స్‌‌‌‌ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? అక్రమ నిర్మాణాల గురించి అధికారులకు తెలియవంటే ఎవరు నమ్ముతారు? మీకు తెలియకుండా ఎక్కడైనా జరుగుతుందా? ఆఫీసర్లు కుమ్మక్కయినట్లుగా పిల్స్‌‌‌‌ పడుతున్నాయంటే ఏమనుకోవాలి? ఆక్రమణలు, ఇల్లీగల్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ కట్టడాలు జరుగుతున్నాయని అధికారులకు తెలుసన్న విషయం జనానికి తెలుసు. మాకూ తెలుసు” అని హైకోర్టు సీరియస్ అయింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధమగూడలోని సర్వే నం43లో 3.22 ఎకరాల సర్కారీ భూమిని ఆక్రమించుకుంటుంటే అధికారులు పట్టించుకోవడం లేదని హైదరాబాద్​కు చెందిన కృష్ణగౌడ్‌‌‌‌ అనే సోషల్‌‌‌‌ వర్కర్‌‌‌‌ వేసిన పిల్‌‌‌‌ను సోమవారం హైకోర్టు విచారించింది. భూములపై సర్వే చేస్తున్నామని, సర్కారీ భూములని తేలలేదని ప్రభుత్వ లాయర్‌‌‌‌ భాస్కర్‌‌‌‌రెడ్డి చెప్పడంతో చీఫ్ జస్టిస్ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చౌహాన్, జడ్జి జస్టిస్‌‌‌‌ అభిషేక్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాకులు చెప్పడం అలవాటైంది…

అంత ఖరీదైన భూమి ఆక్రమణ అయిందంటే సర్వే జరుగుతోందని చెప్పడమేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. సర్వే అనేది రెవెన్యూ శాఖలో నిరంతర ప్రక్రియ అని, రోజుల తరబడి చేసేదేమీ కాదని కామెంట్ చేసింది. జరిగేది జరగనీయడం కోసమే మౌనంగా ఉంటూ ఏదో ఒక సాకు చెప్పడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 అంతస్తుల భవనాలు వెలుస్తుంటే కళ్లు మూసుకుని ఉన్నారా లేక నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. హైకోర్టు చూస్తూ కూర్చోదని తేల్చి చెప్పింది. సదరు భూమిలో నెల రోజుల్లోగా సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. విచారణను వచ్చే నెల 11కి వాయిదా వేసింది.