
- ఒక్కరోజులో తేల్చేశారా?
- 1373 అభ్యంతరాల్ని ఎట్ల పరిష్కరించారో అర్థం కావట్లే
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల వార్డుల విభజనపై వచ్చిన అభ్యంతరాలను సర్కారు పరిష్కరించిన తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కరోజులోనే అభ్యంతరాలన్నీ పరిష్కరించడం ఎట్ల సాధ్యమని ప్రశ్నించింది. సర్కారు చర్యలు కంటితుడుపులా ఉన్నాయనీ, ఏ మాత్రం నమ్మకం కలిగించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియ చట్ట విరుద్ధంగా ఉందని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంజుకుమార్ రెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డి వేర్వేరుగా వేసిన పిల్స్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం మరోసారి విచారించింది. మున్సిపాలిటీల్లో వార్డుల విభజనకు నెల రోజుల టైం అడిగిన సర్కారు 8 రోజుల్లోనే ఎట్ల చేసిందని బెంచ్ ప్రశ్నించింది. ‘‘వార్డుల విభజనపై వచ్చిన 1373 అభ్యంతరాలు అన్నింటినీ ఒకే రోజులో ఎలా పరిష్కరించేశారో అర్ధం కావట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాల్ని జూన్ 21 నుంచి 30 వరకూ చేశామన్నారు. అది ఎట్లా చేశారో కూడా చెప్పలేదు. సర్కార్ చెబుతున్న వాదన వాస్తవానికి దూరంగా ఉన్నట్లుంది” అని ఘాటుగా కామెంట్ చేసింది.
మున్సిపోల్స్ కేసులో సర్కారు కౌంటర్ పిటిషన్ కూడా సరిగా వేయలేదని బెంచ్ చెప్పింది. ‘‘ఒక విషయం చెప్పినప్పుడు అది ఎలా చేశారో చెప్పకుండా నామమాత్రంగా కౌంటర్ వేసినట్లుగా ఉంది. ఉదాహరణకు జనాభా నిష్పత్తి మేరకు వార్డుల విభజన ఎట్లా చేశారో చెప్పలేదు. విభజన చేయడానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లుకు ఎలాంటి శిక్షణ ఇచ్చారో చెప్పలేదు. 1373 అభ్యంతరాలు వస్తే 665 అభ్యంతరాల్ని పరిష్కరించామని చెప్పారేగానీ ఎట్లా చేశారో వివరించలేదు. మిగిలిన 708 అభ్యంతరాల్ని ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా కారణాలు లేవు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ పూర్తికి 109 రోజులు కావాలని సింగిల్ జడ్జి దగ్గర చెప్పారు. అందులో వార్డుల విభజనకు 30 రోజులు పడతాయన్నారు. కానీ 8 రోజుల్లోనే ఎట్లా చేశారో అంతుబట్టట్లేదు. అంతా చూస్తుంటే హడావుడిగా చేశారని అర్ధమైపోతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యంతరాలను పరిష్కరించిన తీరు చూస్తే, నిజంగానే పరిష్కరించారా అనే డౌట్ వస్తోంది” అని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఎందుకు చెల్లవో చెప్పాలె
‘‘సూర్యాపేటలో 79 అభ్యంతరాలు వస్తే ఒక్కటే పరిష్కరించి 78 రిజెక్ట్ చేశారు. మీర్‌పేటలో 39 వస్తే 37 పరిష్కరించి ఒక్కటే తోసిపుచ్చారు. ఆర్మూర్‌లో 20 అభ్యంతరాలు వస్తే అన్నీ చెల్లవన్నారు. కరీంనగర్ లో 109 వస్తే 50 కాదన్నారు. పాలమూరులో77 అభ్యంతరాలు వస్తే 38 చెల్లవన్నారు. ఏయే కారణాల వల్ల వాటిని రిజెక్ట్ చేశారో చెప్పలేదు. అభ్యంతరాలపై మునిసిపల్ కమిషనర్ నోటీసు బోర్డులో పెట్టాలి. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. ప్రజాప్రతినిధులకు తెలపాలి. ఇవన్నీ ఒక్క రోజులో ఎట్లా చేశారో అధికారులకే తెలియాలి” అని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. ‘‘కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలంటే జనానికి చెప్పాలి కదా? వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకోవాలి కదా? ఎల్లారెడ్డిని మున్సిపాలిటీ చేస్తే అక్కడి జనానికి ఏ వార్డులో ఓటు వేయాలో తెలియాలి కదా?” అని కోర్టు కామెంట్ చేసింది.
కొత్తది తెచ్చినా పాత చట్టం ప్రకారమే చేస్తం
రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చినా పాత చట్టం ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు సర్కారు చెప్పింది. ‘‘ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. వార్డుల విభజన, రిజర్వేషన్లపై ప్రజల అభ్యంతరాలను చట్ట ప్రకారం పరిష్కరించాం. మిగిలిన అభ్యంతరాలు చట్ట వ్యతిరేకమైనవి. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ నిబంధనల ప్రకారమే జరిగింది” అని సర్కారు తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు కోర్టుకు వివరించారు. అయితే రాజకీయ కోణంలోనే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ నిర్వహించిందని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. వార్డుల విభజన గందరగోళంగా జరిగిందని చెప్పారు. కొత్త చట్టం వచ్చాక పాత చట్టం ప్రకారం నిర్వహించడం చెల్లదని పిటిషనర్లు వాదించారు. ‘‘ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డులోకి మార్చడం వల్ల రిజర్వు కావాల్సిన వార్డులను జనరల్ వార్డులుగా చేశారు. చాలా అభ్యంతరాలు ఉన్నా సర్కారు పట్టించుకోకుండా ఏకపక్షంగా చేసింది” అని కోర్టుకు చెప్పారు. వాదనల తర్వాత కొత్త మున్సిపల్ చట్టాన్ని తమకు ఇవ్వాలని సర్కారును బెంచ్ ఆదేశించింది. కొత్త చట్టం తెచ్చాక పాత చట్టం ప్రకారం ఎన్నికలు పెట్టడానికి కారణాలు చెప్పాలంది. రెండు చట్టాలకు తేడా ఏంటి? కొత్త చట్టంలో ఏముంది? పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. మున్సిపోల్స్ ఏర్పాట్ల ప్రక్రియ ఒక్కరోజులోనో, వారంలోనో ఎలా చేశారో చెప్పాలని అడిగింది. పిటిషనర్ల అభ్యంతరాలకు వివరణ ఇస్తూ 20వ తేదీ నాటికి సమగ్రంగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.