
- ఉదయం ఎన్నికల నోటిఫికేషన్
- సాయంత్రం ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే
- నిరాశలో ఆశావహులు
మహబూబ్‌నగర్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రెండు రోజులుగా ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రెండు రోజులు విచారణ సాగగా.. గురువారం సాయంత్రం హైకోర్టు జీవోపై స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఉదయమే నోటిఫికేషన్.. సాయంత్రం స్టే..
రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ.. మూడు విడతల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు రాష్ర్ట ఎన్నికల సంఘం గత నెల షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 39 జడ్పీటీసీ స్థానాలు, 426 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు చేసుకోవాలని బుధవారం ఎలక్షన్ కమిషన్అన్ని
జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఉదయం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో అధికారులు ఎంపీటీసీ స్థానాలను క్లస్టర్ వారీగా విభజించారు. ఒక్కో క్లస్టర్పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీటీసీ స్థానాలను చేర్చారు.
ఈ మేరకు ఆయా క్లస్టర్ పరిధిలోని ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న క్యాండిడేట్ల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఎంపీడీవో ఆఫీసులు, గ్రామ పంచాయతీ ఆఫీసులు, రైతు వేదికల వద్ద నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఆయా మండలాల జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు తీసుకునేందుకు మండలాల ఆఫీసుల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేసి ఉదయం 10.30 నుంచి నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు కేంద్రాలను విజిట్ చేసి నామినేషన్ల ప్రక్రియ ఎలా జరుగుతోందనే విషయంపై రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూల్స్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ సాయంత్రం ఎన్నికల నిర్వహణపై హై కోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆగిపోయింది.
నామినేషన్లు అంతంతే..
రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కోర్టు విచారణలో ఉండడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు లీడర్లు ఇంట్రెస్ట్ చూపలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా గురువారం ఎంపీటీసీ స్థానాలకు 13, జడ్పీటీసీ స్థానాలకు ఒక నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. అందులో మహబూబ్‌నగర్ జిల్లాలోని 89 ఎంపీటీసీ స్థానాలకు రాజాపూర్ మండలంలోని ఓ ఎంపీటీసీ స్థానానికి ఒక నామినేషన్ మాత్రమే దాఖలైంది. నారాయణపేట జిల్లాలోని 82 ఎంపీటీసీ స్థానాలకు ఐదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నామినేషన్లు అన్ని కాంగ్రెస్ కు చెందిన లీడర్లు మాత్రమే దాఖలు చేశారు. ఇందులో దామరగిద్ద-1 స్థానానికి ఒకటి, భైరంకొండ స్థానానికి ఒకటి, ధన్వాడ స్థానానికి రెండు, రాంకిష్టయ్యపల్లి స్థానానికి ఒక నామినేషన్దాఖలైంది.
వనపర్తి జిల్లాలోని పెబ్బేరు ఎంపీటీసీ స్థానానికి రెండు, గోపాల్పేట ఎంపీటీసీ స్థానానికి ఒకటి, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్మండలం తాటికుంట ఎంపీటీసీ స్థానానికి ఒకటి, నాగర్‌కర్నూల్‌జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదే జిల్లాలోని ఓ జడ్పీటీసీ స్థానానికి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో జడ్పీటీసీ స్థానాలకు ఏ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు.
నిరుత్సాహంలో లీడర్లు..
ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలో 32 లక్షల పైచిలుకు జనాభా ఉండగా.. అందులో సగానికి పైగానే బీసీ వర్గానికి చెందినవారే ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ర్ట ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు జీవో 9ని విడుదల చేయడంతో అందరూ సంబుర పడ్డారు. జీవో ప్రకారం ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయంగా ఎదిగేందుకు ఆస్కారం ఏర్పడుతుందని బీసీలు భావించారు. ఈ మేరకు చాలా మంది లీడర్లు గ్రౌండ్‌వర్క్ కూడా చేసుకున్నారు. కానీ.. ఈ జీవోపై స్టే ఇవ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించడం, విచారణ అనంతరం కోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధించడంతో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు.