హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 623 ఏఎన్ఎం పోస్టుల నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. ఏఎన్ఎంలుగా కేవలం ఎస్టీ అభ్యర్థులనే నియమించడాన్ని సవాలు చేస్తూ వనపర్తికి చెందిన బి.రమాదేవి, మరో ఇద్దరు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీ దేవి ఇటీవల విచారణ జరిపి మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏఎన్ఎంల నియామకాల కోసం ప్రభుత్వం జూన్ 26న నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు.
దాని ప్రకారం ఎస్సీ, బీసీ అభ్యర్థులతో పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అయితే, బీసీలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఎస్టీలతోనే పోస్టులను భర్తీ చేశారని వివరించారు. ఇది చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కోర్టును కోరారు. ఏపీ వర్సెస్ రామారావు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందని విన్నవించారు. వాదనలను విన్న న్యాయమూర్తి దీనిపై కౌంటరు దాఖలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ తదితరులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. అప్పటివరకు స్టే ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.