 
                                    - కాలేజీల పిటిషన్‌లపై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: షరతులు లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లతో సహా అన్ని పత్రాలు వాపసు ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులపై గురువారం హైకోర్టు స్టే ఇచ్చింది. విద్యా పరిపాలనాపరమైన అంశాలు మానవ హక్కుల పరిధిలోకి రావన్న కాలేజీల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, హక్కుల కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపివేసింది.
ప్రతివాదులైన ప్రభుత్వానికి, విద్యార్థులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఫీజు బకాయిలతో సంబంధంలేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు వాపసు ఇవ్వాలన్న మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ, సెయింట్ పాల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలను విన్న ధర్మాసనం మానవ హక్కుల కమిషన్ ఆదేశాల అమలుపై స్టే ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని విద్యార్థులతోపాటు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 
         
                     
                     
                    