ఆర్టీసీకి పీఎఫ్ నోటీసులపై హైకోర్టు స్టే

ఆర్టీసీకి పీఎఫ్ నోటీసులపై హైకోర్టు స్టే
  • నోటీసుల్లో స్పష్టత లేకపోవడంపై అసంతృప్తి 
  • విచారణ ఈ నెల 29కి వాయిదా

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీ ఉద్యోగుల బీమా పథకం కింద కార్మికులకు రూ.131.76 కోట్ల బకాయిలను చెల్లించాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులో ఏపీఎస్‌‌ఆర్టీసీ అని పేర్కొనడం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బకాయిల వివరాలపై స్పష్టత లేకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. అందుకే దీనిపై స్టే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పీఎఫ్ కమిషనర్‌‌  కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ మంగళవారం నోటీసు జారీ చేశారు. రూ.131.76 కోట్ల బీమా బకాయిల చెల్లింపు కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 11న  పీఎఫ్ కమిషనర్ జారీ చేసిన నోటీసును టీజీఆర్టీసీ హైకోర్టులో సవాల్ చేసింది. 

ఆర్టీసీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి వాదిస్తూ.. 600 క్లెయిమ్స్‌‌లో 165 తెలంగాణకు, 433 ఆంధ్రప్రదేశ్‌‌కు చెందినవని చెప్పారు.  నోటీసులో రాష్ట్రాల వారీగా బకాయిల వివరాలు లేనట్లు తెలిపారు. 2003----–04 నుంచి 2023–-25 వరకు ఉద్యోగ బీమా సొమ్ము కింద ఏపీకి రూ.95.19 కోట్లను తెలంగాణ చెల్లించిందన్నారు. మరణించిన 10,270 ఉద్యోగుల కుటుంబాలకు రూ.160.54 కోట్ల పరిహారం చెల్లించినట్లు వివరించారు. 2014-–15 వరకు అన్ని క్లెయిమ్స్ పరిష్కారం అయ్యాయన్నారు. అయితే, నోటీసులో ఏ రాష్ట్ర బకాయి ఎంతో స్పష్టత లేనందున స్టే ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.