విశాక ఇండస్ట్రీస్‌‌కు నగదును చెల్లించండి.. హైకోర్టు ఆదేశం

విశాక ఇండస్ట్రీస్‌‌కు నగదును చెల్లించండి..  హైకోర్టు ఆదేశం

 

  •     తొలి విడతగా రూ.17.5 కోట్లను ఆరు వారాల్లో జమ చేయండి
  •     హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌కు హైకోర్టు ఆదేశం
  •     ఉప్పల్‌‌ స్టేడియం నిర్మాణ వ్యవహారాల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్‌‌‌‌ స్టేడియం నిర్మాణ వ్యవహారాల విషయంలో విశాక ఇండస్ట్రీస్‌‌‌‌కి డబ్బు చెల్లించని హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ)కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి విడతగా రూ.17.5 కోట్లను ఆరు వారాల్లోగా చెల్లించాలని హెచ్‌‌‌‌సీఏకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. హెచ్‌‌‌‌సీఏకి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేయాలంటూ వెలువడిన ఉత్తర్వులను తొలగించింది. ఆర్బిట్రేషన్‌‌‌‌ అవార్డులో భాగంగా విశాక ఇండస్ట్రీస్‌‌‌‌కి రూ.40 కోట్లు చెల్లించాలన్న ఉత్తర్వుల మేరకు తొలివిడతగా రూ.17.5 కోట్లను వాణిజ్య వివాదాల కోర్టులో డిపాజిట్‌‌‌‌ చేయాలని చెప్పింది. ఆ మొత్తం చెల్లింపునకు ఆరు వారాల గడువు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విశాక ఇండస్ట్రీస్‌‌‌‌ చేస్తున్న న్యాయపోరాటం ఫలించింది. మరోవైపు హైదరాబాద్‌‌‌‌లోని ఉప్పల్‌‌‌‌ అంతర్జాతీయ స్టేడియంలో ప్రపంచ కప్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ పోటీల నిర్వహణకు సంబంధించి హెచ్‌‌‌‌ సీఏకి ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి.

ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చారు: హెచ్‌‌‌‌సీఏ

వాణిజ్య వివాదానికి సంబంధించిన కేసులను పరిగణనలోకి తీసుకోకుండా ఆస్తులను జప్తు చేస్తూ వాణిజ్య వివాదాల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో హెచ్‌‌‌‌సీఏ సవాల్‌‌‌‌ చేసింది. హెచ్‌‌‌‌సీఏ తరఫున అడ్మినిస్ట్రేటర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్‌‌‌‌ లావు నాగేశ్వరరావు ఈ పిటిషన్‌‌‌‌ను దాఖలు చేశారు. దీన్ని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌.వి.శ్రవణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ల బెంచ్ శుక్రవారం విచారించింది. తొలుత హెచ్‌‌‌‌సీఏ తరఫున సీనియర్‌‌‌‌ లాయర్​ రాజా శ్రీపతి వాదనలు వినిపించారు. ‘‘స్టేడియం అభివృద్ధి ఒప్పందాన్ని రద్దు చేయడంతో విశాక ఇండస్ట్రీస్‌‌‌‌కు రూ.40 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేషన్‌‌‌‌ అవార్డు ఏకపక్షంగా జారీ అయ్యింది. దీన్ని సవాల్‌‌‌‌ చేశాం. అది పెండింగ్‌‌‌‌లో ఉండగానే ఆర్బిట్రేషన్‌‌‌‌ అవార్డు అమలు కోసం కింది కోర్టును విశాక ఇండస్ట్రీస్‌‌‌‌ ఆశ్రయించింది. మా వాదన వినకుండా ఆర్బిట్రేషన్‌‌‌‌ అవార్డు ఉత్తర్వుల అమల్లో భాగంగా హెచ్‌‌‌‌సీఏ ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని వల్ల ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో పోటీలు నిర్వహించడం కష్టం అవుతుంది’’ అని చెప్పారు.

ఎక్కడా తొందరపాటుగా వ్యవహరించలేదు: విశాక ఇండస్ట్రీస్

హెచ్‌‌‌‌సీఏ వాదనలను విశాక ఇండస్ట్రీస్‌‌‌‌ తరఫు సీనియర్‌‌‌‌ లాయర్​ సునీల్‌‌‌‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఈ వివాదం ఇప్పటికిప్పుడు మొదలు కాలేదు. 2016 మార్చి 15న ఆర్బిట్రేషన్‌‌‌‌ అవార్డు పాస్‌‌‌‌ అయ్యింది. ఆ మధ్యవర్తిత్వ తీర్మానాన్ని ఇప్పటి వరకు హెచ్‌‌‌‌సీఏ అమలు చేయలేదు. అదే ఏడాది వాణిజ్య వివాదాల కోర్టుకు వివాదం చేరితే దాన్నీ పట్టించుకోలేదు. కనీసం స్టే కోసం కూడా హెచ్‌‌‌‌సీఏ ప్రయత్నించలేదు. 2021లో ఎగ్జిక్యూషన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ వేశాం. 2022 అక్టోబర్‌‌‌‌ 6న స్టేడియం, ఆస్తుల అటాచ్‌‌‌‌ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటన్నింటిపై హెచ్‌‌‌‌సీఏకి ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నది. అక్టోబర్‌‌‌‌ 6న కూడా సమాచారం ఇచ్చాం. దీన్నీ హెచ్‌‌‌‌సీఏ పట్టించుకోలేదు. దీంతో కమర్షియల్‌‌‌‌ కోర్టుకు వెళ్లాం.

ఈ వివాదంలో హెచ్‌‌‌‌సీఏ కౌంటర్‌‌‌‌ కూడా వేయలేదు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌‌‌‌పార్టీ ఆర్డర్‌‌‌‌ వెలువడింది. ఈ నెల 19న కౌంటర్‌‌‌‌ వేయాలని కోరినా వేయలేదు. 22వ తేదీన హెచ్‌‌‌‌సీఏ ఆస్తులు, బ్యాంక్‌‌‌‌ ఖాతాల జప్తు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్బిట్రేషన్ అమౌంట్ వడ్డీతో కలిపి సుమారు 61 కోట్లు అయింది. కానీ ఏ దశలోనూ ఆర్బిట్రేషన్ అమౌంట్ చెల్లించేందుకు హెచ్‌‌‌‌సీఏ ఆసక్తి చూపలేదు. విశాక ఇండస్ట్రీస్‌‌‌‌ ఎక్కడా తొందరపాటుగా వ్యవహరించలేదు” అని వివరించారు. ఆర్బిట్రేషన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌లోని సెక్షన్​ 34 కింద వేసిన కేసులో హెచ్‌‌‌‌సీఏ డిఫాల్ట్‌‌‌‌ అయ్యిందని చెప్పారు. 

ఏడేండ్లు ఎదురుచూసినం

హెచ్‌‌‌‌సీఏ అడ్మినిస్ట్రేటర్‌‌‌‌గా సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి ఉన్నారని, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని కోర్టుకు విశాక ఇండస్ట్రీస్ తరఫు న్యాయవాది సునీల్ తెలిపారు. ఏడేండ్లు నిరీక్షించామని, చివరికి జప్తు ఉత్తర్వులు పొందాల్సి వచ్చిందని వివరించారు. ఏ దశలోనూ హెచ్‌‌‌‌సీఏ కనీసం స్టే ఇవ్వాలని కూడా కోరలేదన్నారు. ఇప్పుడు కూడా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ పోటీలు ఉన్నందున ఆటంకం లేకుండా స్టే ఇవ్వొచ్చని, అయితే మూడో వంతు డిపాజిట్‌‌‌‌ చేశాక స్టే ఉత్తర్వులు జారీ చేస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న బెంచ్.. హెచ్‌‌‌‌సీఏ ఎంత మొత్తం డిపాజిట్‌‌‌‌ చేస్తుందని న్యాయవాదిని ప్రశ్నించింది. ఆర్బిట్రేషన్‌‌‌‌ రూ.25 కోట్లకు వచ్చిందని, అందులో సగం మొత్తం డిపాజిట్‌‌‌‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్‌‌‌‌ న్యాయవాది శ్రీపతి చెప్పారు.

దీనిపై సునీల్‌‌‌‌ కల్పించుకుని తొలి ఆర్బిట్రేషన్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ ఉత్తర్వులు హెచ్‌‌‌‌సీఏ అమలు చేయకపోవడంతో వడ్డీ భారీగా పెరిగిపోయిందని, ఇందులో మూడో వంతు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైకోర్టు కల్పించుకుని.. ముందుగా హెచ్‌‌‌‌సీఏ నగదు డిపాజిట్‌‌‌‌ చేయాలని, తర్వాత ఇతర అంశాల జోలికి వెళ్తామని స్పష్టం చేసింది. మూడు ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌లు ఉన్నందున ఆస్తుల జప్తు ఉత్తర్వులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్‌‌‌‌ లావాదేవీల నిర్వహణ కొనసాగించేలా అడ్మినిస్ట్రేటర్‌‌‌‌కు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆరు వారాల్లో రూ.17.5 కోట్లను వాణిజ్య వివాదాల కోర్టులో హెచ్‌‌‌‌సీఏ చెల్లించాలని, నాలుగు వారాల్లోగా ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇదీ కేసు

ఉప్పల్‌‌‌‌ స్టేడియం డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ పనుల విషయంలో విశాక ఇండస్ట్రీస్‌‌‌‌తో హెచ్‌‌‌‌సీఏకు గతంలో ఒప్పందం కుదిరింది. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి బ్యాంకులో లోన్ తెచ్చి విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్ చేసింది. అయితే ఈ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ను హెచ్‌‌‌‌సీఏ క్యాన్సిల్ చేసింది. దీంతో విశాక ఇండస్ట్రీస్  కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు విశాక ఇండస్ట్రీస్‌‌‌‌కి 18 శాతం యాన్యువల్ ఇంట్రె స్ట్‌‌‌‌తో రూ.25 కోట్లు చెల్లించాలని 2016లో కోర్టు ఆదేశించింది. అయితే విశాక ఇండ స్ట్రీస్‌‌‌‌కి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవ డంతో హెచ్‌‌‌‌సీఏ ప్రాపర్టీస్​ని, బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌ని 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో కమర్షి యల్ కోర్టు అటాచ్ చేసింది. బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌ను డీఫ్రీజ్ చేయాలని హైకోర్టులో హెచ్‌‌‌‌సీఏ అప్పీలు చేసింది.