వెలుగు ఫోటోగ్రాఫర్, నిజామాబాద్ : సంక్రాంతి పండుగ అంటేనే ఇంటింటా పిండివంటలు, సంప్రదాయ రుచులు గుర్తుకొస్తాయి. అప్పాలు, సకినాలు, గారెలు, అరిసెలు, మురుకులు వంటి పిండివంటలు పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతాయి. ఈ సారి పెరిగిన వంటనూనె ధరలు, పని తీరికలేమి కారణంగా చాలా మంది ఇంట్లో తయారీకి బదులుగా రెడీమేడ్ పిండివంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆన్‌లైన్ ద్వారా పిండివంటలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.
ఈ పరిస్థితితో పిండివంటలు తయారు చేసే వ్యాపారులు ఫుల్ బిజీగా మారారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎన్నడూ లేనంతగా ఆర్డర్లు వచ్చాయని వారు చెబుతున్నారు. సంప్రదాయ రుచులను ఆస్వాదించాలనే ఆసక్తితో ప్రజలు రెడీమేడ్ పిండి వంటలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో జన్మభూమి రోడ్డులో శ్రీసాయి ఫుడ్స్ కు చెందిన షాపు వారు ఇలా అప్పాలు, గారెలు, సకినాలు, ముర్కులు, తయారు చేసి కిలోకు రూ. 220 చొప్పున విక్రయిస్తున్నారు. -
