సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వేస్ట్: అమెరికాలో పూజారులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..? షాకింగ్ లెక్కలు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వేస్ట్: అమెరికాలో పూజారులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..? షాకింగ్ లెక్కలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చదివి, రేయింబగళ్లు కోడింగ్ చేసి, వీసా కోసం ఏళ్ల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లినట్లేనా? ఇప్పుడు అమెరికాలో హై డిమాండ్ ప్రొఫెషన్ ఏంటో తెలుసా.. మన పురోహితుల ఉద్యోగమేనంట. అవునండీ బాబు పంతుళ్లే కదా అని ఈజీగా తీసేయకండి వాళ్లకు అమెరికాలో ఉన్న డిమాండ్ గురించి, వారి ఆదాయాల గురించి ఒక యువతి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి...

అమెరికాలో ఉండే హిందూ పూజారులు ఒక చిన్న పూజకు ఎంత వసూలు చేస్తారో తెలుసా అంటూ యూఎస్ బేస్డ్ ఇండియన్ కంటెంట్ క్రియేటర్, బ్లాగర్ సారికా యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక రీల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె చెప్పిన లెక్కలు చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

సారికా యాదవ్ తన వీడియోలో.. అమెరికాలో ఒక చిన్న సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో జరిపించాలంటే పూజారులు ఎంత ఛార్జ్ చేస్తారో చెప్తూ క్రేజీ వివరాలు వెల్లడించింది. ఒక సాధారణ పూజకు కనీసం రూ.29వేల నుంచి రూ.33వేల వరకూ ఛార్జ్ చేస్తారంట. కేవలం పూజారి ఫీజే కాకుండా.. టెంపుల్స్ ద్వారా బుక్ చేసుకుంటే అదనంగా మరో రూ.10వేల నుంచి రూ.15వేల వరకూ సర్వీస్ ఛార్జీల రూపంలో కట్టాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. కొన్నిసార్లు భక్తులే పూజా సామాగ్రి తెచ్చుకుంటే, మరికొన్నిసార్లు సామాగ్రి తెచ్చినందుకు పండిట్ జీకి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది ఆమె.

అమెరికాలో ఉండే భారతీయ కమ్యూనిటీలో పూజారులకు ఏడాది పొడవునా ఫుల్ డిమాండ్ ఉంటుందని సారిక తెలిపింది. కొత్త ఇళ్ల గృహప్రవేశాలు, ధనత్రయోదశి, శ్రావణ మాసం నోములు, అంతెందుకు కొత్త వాహనాలు కొన్నా సరే పూజలు చేయించడానికి పండిట్ జీలు అసలు ఖాళీ ఉండరని చెప్పుకొచ్చింది. చాలామంది పూజారులు ప్రత్యేకంగా మతపరమైన వృత్తుల కోసం కేటాయించిన 'R-1' వీసా కేటగిరీ ద్వారా అమెరికాకు వస్తుంటారని ప్రస్తుతం వాళ్లకు ఉన్నంత డిమాండ్ ఎవ్వరికీ లేదంటూ వీడియోలో వెల్లడించింది.

వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు క్రేజీ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు వదిలేసి, పూజలు నేర్చుకోవాల్సి వచ్చేలా ఉందంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగాల కంటే ఇదే బెటర్ అంటూ మరికొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం డాలర్లలో సంపాదనను రూపాయిల్లోకి మార్చి చూడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఉండే ద్రవ్యోల్బణం, అక్కడి జీవన ప్రమాణాల ప్రకారం 300 డాలర్లు అనేది చాలా సాధారణమైన మొత్తమని గుర్తుచేస్తున్నారు. భారతదేశంలో పురోహితులకు కేవలం రూ.101 దక్షిణ ఇచ్చి పంపించే రోజులు ఉన్నాయని, అందుకే చాలామంది ఇక్కడ ఇల్లు గడవక సెక్యూరిటీ గార్డులుగా, ప్యూన్లుగా మారుతున్నారని, అలాంటిది అమెరికా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఈ ఫీజు చాలా తక్కువేనని ఆమె వీడియోపై రియాక్ట్ అవుతున్నారు.