జూరాల ప్రాజెక్టు దిగువన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పై ముందడుగు

జూరాల ప్రాజెక్టు దిగువన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పై ముందడుగు
  • కొత్తపల్లి దగ్గరే బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాట్లు
  • టెండర్లు కంప్లీట్ బ్రిడ్జి నిర్మాణానికి 84 కోట్లు
  • ఫాస్ట్ గా కొనసాగుతున్న మట్టి టెస్టింగ్ ప్రక్రియ,

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టు దిగువన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంలో ముందడుగు పడింది. గద్వాల మండలం కొత్తపల్లి దగ్గరే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 84 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి కూడా టెండర్లు కంప్లీట్ అయ్యాయి. నాగర్ కర్నూల్ కి చెందిన ఓ కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణ పనులను దక్కించుకున్నారు. మట్టి నమూనాల సేకరణ ఫాస్ట్ గా కొనసాగుతున్నది. వారం రోజుల్లో  మట్టి నమూనాల సేకరణ   కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉన్నది.

ఇటీవల రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. జూరాల ప్రాజెక్టు పరిశీలన చేశాక ప్రాజెక్టుపై హెవీ వెహికల్స్ తిరగడం వల్ల ఇబ్బంది ఉందని భావించి జూరాల దిగువన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టేందుకు జీవో జారీ చేశారు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు మోక్షం కలిగింది.

కొత్తపల్లి జూరాల మధ్యన హై లెవెల్ బ్రిడ్జి

గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు మండలం జూరాల మధ్యన కృష్ణా నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జి 750 మీటర్ల వరకు ఉంటుంది. గద్వాల టౌన్ లోని గంజిపేట దగ్గర ఉన్న సబ్ స్టేషన్ నుంచి ఆత్మకూరు మండలంలోని జూరాల వరకు మొత్తం 10.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరగనున్నది. కొత్తపల్లి దగ్గర  రోడ్డు మూల మలుపులు ఉన్నచోట కొంత భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరిగితే గద్వాల నుంచి ఆత్మకూరుకు దాదాపు 21 కిలోమీటర్ల దూరం 
తగ్గనున్నది.

 121.92 కోట్ల తో టెండర్లు

జూరాల దిగువన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం 2022లోనే ఇరిగేషన్ శాఖ అంచనాలు రూపొందించింది. బ్రిడ్జి నిర్మాణం కోసం 121.92 కోట్లు ఎస్టిమేషన్ వేసింది. అదే అంచనాలతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్ అండ్ బి శాఖ టెండర్లు పిలిచింది. అప్పట్లో జూరాల దిగువన ఒక కిలోమీటర్ దూరంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ధరూర్ మండలం రేవలపల్లి విలేజ్ నుంచి అమరచింత మండలం నందిమల్ల వరకు బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని రైట్ లెఫ్ట్ కెనాల్ తో పాటు సమాంతర కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అప్పట్లో అంచనాలు రూపొందించారు.

 ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ స్థలం మారడంతో అంచనాలు కూడా గణనీయంగా తగ్గాయి. 121 కోట్ల ఎస్టిమేషన్ తో టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ మాత్రం 84 కోట్ల అంచనాలకే పనులు చేసేందుకు టెండర్ వేసినట్లు తెలుస్తున్నది. బ్రిడ్జి నిర్మాణ దూరం తగ్గడమే ఇందుకు  కారణంగా చెబుతున్నారు. 12.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిన తట్టుకునేలా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టినందుకు ప్రణాళికలు రూపొందించారు.

గత ప్రభుత్వం పట్టించుకోలే

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన తర్వాత బ్రిడ్జి నిర్మాణ పనులపై వేగంగా అడుగులు పడుతున్నాయి. జూరాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన పట్టించుకోలేదు. 2022లో కేవలం ఎస్టిమేషన్లు వేసి చేతులు దులుపుకున్నారు. 

ఇటీవల మంత్రి పర్యటన అనంతరం ప్రాజెక్టు నిర్మాణం కోసం జీవో జారీ చేశారు. ఆ తర్వాత ఆర్ అండ్ బి శాఖ సిఈ ఎస్ ఈ, ఈ ఈ లు బ్రిడ్జి నిర్మాణ పనుల ప్లేసును పరిశీలించారు. ప్లేస్ ఎంపికపై కన్సల్టెంట్స్ కు అప్పజెప్పి రిపోర్టులు తెప్పించుకున్నారు. టెండర్లు కంప్లీట్ చేశారు ప్రస్తుతం మట్టి నమూనా సేకరణ వేగంగా కొనసాగుతున్నది.

జనవరిలో పనులు స్టార్ట్ అయ్యే ఛాన్స్

జూరాల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు కంప్లీట్ అయినప్పటికీ ఇంకా అగ్రిమెంట్ కాలేదు. బ్రిడ్జి నిర్మాణ పనులు జనవరిలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణానికి ముందు తీసుకునే పనులు కొనసాగుతున్నాయి.

త్వరలో పనులు స్టార్ట్ అవుతాయి

హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్లు కంప్లీట్ చేశాం. జనవరిలో పనులు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ప్రస్తుతం మట్టి నమూనా టెస్టింగ్ లు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చూస్తున్నాం.-రాజేందర్, ఆర్ అండ్ బి, ఎస్ సి.