ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం కోసంఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం కోసంఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
  • ముగ్గురు అధికారులతో నియమించిన ప్రభుత్వం
  • ప్యాకేజీ ధరల ఖరారు, ట్రాన్స్‌‌లేటర్ల ఏర్పాటుపై కసరత్తు
  • నెలలో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-–30లో భాగంగా మెడికల్ టూరిజాన్ని ఫోకస్ సెక్టార్‌‌ గా గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని సర్కారు దవాఖానల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

సనత్‌నగర్  టిమ్స్‌‌ లో స్పెషల్ బ్లాక్.. 

ఈ ప్రాజెక్టులో భాగంగా సనత్‌‌ నగర్‌‌ లోని తెలంగాణ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో విదేశీ పేషెంట్ల కోసం ఒక ప్రత్యేక ‘ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్’ను ఏర్పాటు చేసే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. టిమ్స్‌‌ లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఏయే రకమైన సర్జరీలు, డయాగ్నస్టిక్ సేవలను విదేశీయులకు అందించవచ్చో ఈ కమిటీ తేల్చనుంది. ఇందుకోసం టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ పి.గౌతమి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందించే ఈ వైద్య సేవలకు సంబంధించి ప్యాకేజీ రేట్లు, ధరల ఖరారు విధానంపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది.

ట్రాన్స్‌‌లేటర్లు, స్పెషల్ ఫుడ్ సౌకర్యం.. 

విదేశాల నుంచి వచ్చే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర దేశాల భాషలు తెలిసిన అనువాదకులు, వారి అలవాట్లకు తగ్గట్టుగా ప్రత్యేక ఆహారం, అటెండెంట్లు ఉండేందుకు కావాల్సిన వసతి సౌకర్యాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేయనుంది. తెలంగాణ మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డుతో కలిసి ఈ సేవలను అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ కమిటీ తన పూర్తి స్థాయి నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తూ ఆదేశించారు..