పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో వైద్యులు హైరిస్క్ సర్జరీ చేసి రోగి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు(56) 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 6న గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. రోగికి గుండె సంబంధిత సమస్యలు, హృదయ ధమనిలో స్టెంట్ ఉండడంతో ఈ కేసును హైరిస్క్ గా వైద్యులు పరిగణించి అడ్మిట్చేసుకున్నారు. రోగి పరిస్థితిని అంచనా వేసి ఆలస్యం లేకుండా గుండెకు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు.
కార్డియాలజీ, అనస్థీషియో నిపుణులు సమగ్రంగా పరిశీలించిన తర్వాత శస్త్రచికిత్సకు అనుమతి ఇచ్చారు. శస్త్రచికిత్స సమయంలో రోగి పిత్తాశయం (గాల్ బ్లాడర్) అత్యంత పెద్దదిగా మారి రాళ్లతో నిండిపోయినట్టు గుర్తించారు. వైద్య బృందం శస్త్ర చికిత్స చేసి పిత్తాశయాన్ని పూర్తిగా తొలగించారు. రోగి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడడంతో సోమవారం డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు.
హైరిస్క్ శస్త్ర చికిత్సను సర్జన్ డా. సునీల్ కుమార్ నేతృత్వంలోని బృందం విజయవంతంగా నిర్వహించారు. అనంతరం హైరిస్క్ సర్జరీని చేసిన డాక్టర్లను సూపరింటెండెంట్ ప్రొఫెసర్వాణి అభినందించారు.
