
- ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి ప్రత్యేక నిఘా..
- ప్రత్యేక బస్సులు, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల వినియోగం
- సుందరిమణుల చుట్టూరా మహిళా ఇన్స్పెక్టర్లు, షీ టీం సిబ్బంది
- ఈ నెల 14న ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాక
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తుండగా, ఈ నెల 14న కంటిస్టెంట్లు ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వారికి స్థానికంగా హై సెక్యూరిటీ ఏర్పాటు చేయనున్నారు. భారత్– పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరుగుతుండగా అతిథులకు ముందస్తు భద్రత పెంచాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ – చత్తీస్‌గఢ్ బార్డరైన కర్రెగుట్టలో పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్‌హాట్ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఓరుగల్లు పోలీసులు హై సెక్యూరిటీ ఉండేలా చూస్తున్నారు.
ఓరుగల్లులో 4.35 నుంచి 9 గంటల వరకు..
ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా ఈ నెల 14న మిస్ వరల్డ్ బ్యూటీస్ 56 మందితోపాటు వారి కేర్‍టేకర్లున్నారు. జిల్లాలో మొత్తం పర్యటన దాదాపు 4.30 గంటల నుంచి 5 గంటల్లో పూర్తి కానుంది. 14న సాయంత్రం 4.35 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ చేరుకుంటారు. వారికి సాంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలుకుతారు. 5.30 హోటల్ నుంచి బస్సు ద్వారా రెండు బ్యాచ్‌లుగా విడిపోయి 30 మంది రామప్ప టెంపుల్, మరో బ్యాచ్ వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్ పర్యటనకు వెళ్తారు. ఇది ముగిశాక రాత్రి 7.55 నుంచి 8.15 మధ్యన రెండు గ్రూపులు తిరిగి హరిత హోటల్ చేరుకుంటాయి. మటన్, నాటుకోడి చికెన్, బోటి, తలకాయ, పాయ వంటి తెలంగాణ స్పెషల్ వంటకాలతో డిన్నర్ అనంతరం సుమారు 9 గంటలకు హైదరాబాద్ తరలివెళ్తారు.
మూడంచెల భద్రత..
సుందరీమణుల వరంగల్ పర్యటనను రాష్ట్ర టూరిజం శాఖతో కలిసి షో బోట్ ఈవెంట్ సంస్థ పర్యవేక్షిస్తుంది. కాగా, దేశంలో భారత్–పాకిస్థాన్ యుద్ధం, రాష్ట్రంలో ఉమ్మడి ఓరుగల్లులో మావోయిస్టులు–పోలీసుల మధ్య కాల్పులు, ఎన్‍కౌంటర్లు జరుగుతున్నందున వాతావారణం ఉద్రిక్తంగా ఉంది. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‍తోపాటు ములుగు జిల్లా పోలీసులు సుందరీమణులకు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 2 వోల్వో, ఒక మినీ ఏసీ బస్సులకు తోడు మరో రెండు బస్సులు రెడీగా ఉంచారు.
హరిత హోటల్ నుంచి మొదలు వారు పర్యటించే ఏరియాలు మొత్తం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. దీనికోసం అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా అణువణువూ పరిశీలించనున్నారు. సీపీ, డీసీపీ, ఏసీపీల పర్యవేక్షణలో 200 నుంచి 300 మంది పోలీసులు, స్పెషల్ ఫోర్స్ బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు. వారికి దగ్గర్లో వివిధ విభాగాల్లో ఉన్న మహిళా ఇన్స్పెక్టర్లతోపాటు షీ టీం సిబ్బంది విధులు నిర్వహించేలా సన్నద్ధం అవుతున్నారు.
సుందరీమణుల రాకపై సస్పెన్స్..
టూరీజం శాఖ ఆధ్వర్యంలో గడిచిన వారం నుంచి హరిత కాకతీయ హోటళ్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. సుందరీమణులు హోటలో అడుగుపెట్టాక ఇచ్చే వెల్‍కం డ్రింక్ మొదలు వివిధ దేశాల ఫుడ్ ఐటమ్‍లు, తెలంగాణ స్పెషల్ వంటకాలు, వాటిని వండేందుకు అవసరమైన చెఫ్ లను అందుబాటులో ఉంచారు.
బస్సులు రెడీ చేసి పెట్టారు. పోలీసులు మూడంచెల భద్రతకు అవసరమైన హై సెక్యూరిటీ ప్లాన్ చేసుకున్నారు. అయితే.. దేశంలో, రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా అందాల భామలు వచ్చే చివరి నిమిషం వరకు డౌట్‍గానే ఉంది. మొత్తం టూర్ చూసే ఈవెంట్ సంస్థ వారు పర్యటించే ప్రాంతాల్లోకి వచ్చి పర్యవేక్షణ చేయలేదు. శుక్ర, శనివారాల్లో దీనిపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.