చెదల ఇళ్లలో హై టెక్నాలజీ

చెదల ఇళ్లలో హై టెక్నాలజీ

ఎండలు మండిపోతున్నయ్. వేడి దాదాపు 50 డిగ్రీలకు చేరుతోంది. చల్లటి నీళ్లతో పాటు సల్లటి ఇంటి కోసం కూడా జనం తహతహలాడుతున్నారు. ఇంట్లో ఓ ఏసీయో, కూలరో లేకపోతే బతుకు నరకంలా అనిపిస్తోంది. మరో వందేళ్లలో భూమి సగటు టెంపరేచర్ మరో రెండు డిగ్రీలు పెరుగుతోందంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే అప్పటి పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఎన్నో వసతులు ఉంచుకుని కూడా మనం ఎండను తాళలేకపోతుంటే.. అడవుల్లోని ఓ జీవి మాత్రం ఎండలా.. పాడా.. మా ఇల్లు కూల్ కూల్ అంటోంది! సైంటిస్టులేమో అవును వాటిని చూసి మనం నేర్చుకోవాలంటున్నారు.

హోమ్ మేకర్ చెద…

ఎత్తైన పుట్ట.. లెక్కలేనన్ని రంధ్రాలు.. ఇదే చెదల గూడు. మట్టి రేణువులను కూడగట్టి పేద్ద పుట్టల్ని పెట్టడం చెదలకు వెన్నతో పెట్టిన విద్య. గాలి ఎటువైపు నుంచి వచ్చినా మరోవైపు బయటకు వెళ్లిపోయేలా ఈ పుట్టల్లో వెసులుబాటు ఉంటుంది. అందుకే బయటి ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా పుట్టల్లోపల ఏసీ వేసినట్లు చల్లగా ఉంటుంది. చీమల జాతికి చెందినవే చెదలు. అయితే ఈ పుట్టల రూపురేఖలన్నీ ఒకేలా ఉండవు. ఉండే ప్రాంత వాతావరణాన్ని బట్టి పుట్టను డిజైన్ చేసుకుంటాయి చెదలు. ఎక్కువ వేడి ఉండే చోట.. ఎక్కువ కన్నాలతో పొడవైన పుట్టలు కట్టేస్తాయి. ఆ తర్వాత బయటి పరిస్థితులతో సంబంధం లేకుండా హాయిగా బతికేస్తాయి. తిండి కోసం ఓ రకమైన ఫంగస్‌‌ను పెంచుతూ, దాన్నే తింటూ ఉంటాయి. వీటి ఫార్ములాను చూసి బ్రిటన్‌‌లోని నాటింగ్‌‌హామ్‌‌  యూనివర్సిటీ సైంటిస్టులు తెగ ముచ్చటపడిపోతున్నారు. ఇదే టెక్నిక్‌‌తో మనుషుల ఇళ్లూ కట్టుకుంటే వెంటిలేషన్, ఉష్ణోగ్రత నియంత్రణతో దాదాపు 90 శాతం కరెంటు ఆదా చేయొచ్చని చెబుతున్నారు. వచ్చే 30 ఏళ్లలో ప్రతి సెకను పది కొత్త ఏసీలు అమ్ముడుపోతాయని అంచనా వేశారు. ఈ సమస్యను దాటాలంటే మనం కూడా చెదల్లా ఇళ్లు కట్టుకోవాలంటున్నారు.

జింబాబ్వేలో ‘చెద’ ఇల్లు…

ఫంగస్‌‌ను పెంచే చెదలు.. పుట్టల్ని బాగా ఎత్తుగా కడతాయి. పైన పెద్ద చిమ్నీలను ఏర్పాటు చేసుకుంటాయి. చెద పుట్టల స్ఫూర్తితో జింబాబ్వేలో పెద్ద బిల్డింగ్ కట్టారు. దీన్ని ఈస్ట్ గేట్ సెంటర్ గా పిలుస్తున్నారు. ఈ బిల్డింగ్‌‌లో ఏసీలు ఉండవు. దీన్ని ఆపరేట్ చేయడానికి, పక్కనే ఉండే ఉండే భవనాలతో పోల్చితే 90% తక్కువ కరెంటు ఖర్చు అవుతోంది.

రూపంలోనే ఉందంతా..

చెద పుట్టల్లోని వెంటిలేషన్ సీక్రెట్ చిన్న చిన్న బ్లాక్స్ లో దాగుందని నాటింగ్‌‌హామ్ యూనివర్సిటీ సైంటిస్టులు తేల్చారు. వీటి ద్వారానే గాలి సహజంగా పుట్ట మూలమూలలకు చేరుతోందని గుర్తించారు. పశ్చిమ ఆఫ్రికాలోని సెనగల్, గినియా దేశాల్లోని అడవులకు చేరుకున్న సైంటిస్టుల టీమ్.. కొన్ని పుట్టల్ని తవ్వారు. మట్టి, నీళ్లు, లాలాజలంతో చెదలు వాటిని కట్టినట్లు తేల్చారు. సెనగల్‌‌లో ఇసుకతో, గినియాలో బంకమన్నుతో పుట్టలు పెట్టాయని గుర్తించారు. ఈ పుట్టల గోడలపై చిన్నపాటి రంధ్రాలున్నాయి. లోపలున్న గోడ లేయర్స్ రంధ్రాలతో, బయట ఉన్న గోడ రంధ్రాలు లింకై ఉన్నట్లు ఎక్స్ రే టెస్టుల్లో తేలింది. అచ్చూ ఇలాంటి డిజైన్ తోనే మనుషులు ఇళ్లు కట్టుకుంటే అవి చల్లగా ఉంటాయని చెప్పారు.