ఇంట్లో ఉన్నా ఉడుకు : రాష్ట్రంలో రికార్డ్ టెంపరేచర్

ఇంట్లో ఉన్నా ఉడుకు : రాష్ట్రంలో రికార్డ్ టెంపరేచర్

రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అగ్గి వాన కురిపిస్తున్నాడు. సాధారణం కంటే 5 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా నమోదువుతోంది. పెరిగిన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాతే.. బయటకు వస్తున్నారు.  రాత్రిళ్లు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

రాష్ట్రంలో నిన్న అత్యధికంగా మంచిర్యాల జిల్లా వేమన్ పల్లి మండలం నీల్వాల్ లో 47.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయ్యింది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. 121 ఏళ్ల చరిత్రలో నమోదైన రెండో అత్యధిక ఉష్ణోగ్రతకు ఇది సమానం అని అధికారులు చెప్పారు.

జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 47.7 డిగ్రీలు, జైనలో 47.6 డిగ్రీలు, ఖమ్మంలో 46.2 డిగ్రీలు, రామగుడంలో 46 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, నిజామాబాద్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హన్మకొండలో 44 డిగ్రీలు, మెదక్ లో 43.6 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 42 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయ్యింది. అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న  జాబితాలో  ఆదిలాబాద్ ఏడో స్థానంలో నిలిచింది. రామగుండం 9, నిజామాబాద్ 14వ స్థానంలో నిలిచింది.

జూన్ 10 వరకు మండే ఎండలు

రాష్ట్రంలో ఎండలతో పాటు వడగాలులతో జన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ 10 వరకు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరో 15 రోజుల వరకు వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలుల వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.