
హైదరాబాద్, వెలుగు: సెయిలింగ్ స్పోర్ట్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మన రాష్ట్రం నుంచి ఎంతో మంది సెయిలర్లు ఇంటర్నేషనల్ లెవెల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెంతో మంది యువ సెయిలర్లు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ నిర్వహిస్తున్న టిస్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా 5వ ఎడిషన్ పోటీలను మంత్రి వివేక్.. శనివారం హుస్సేన్‌సాగర్ లేక్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సెయిలింగ్‌ను ప్రోత్సహిస్తున్న సికింద్రాబాద్ క్లబ్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఆటను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సికింద్రాబాద్ క్లబ్‌లో తాను రెగ్యులర్ మెంబర్‌ను అని, ఆ ప్లేస్ తనకెంతో ఇష్టమని చెప్పారు. అనంతరం సికింద్రాబాద్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ సింగ్, టిస్కాన్ రెడిబిల్డ్ ప్రతినిధి ఆదిత్య జైన్‌తో కలిసి రెగట్టా జెర్సీలు ఆవిష్కరించారు. ఈ టోర్నీ ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు జరగనుంది.
క్రీడల్లో రాణిస్తే యువతకు మంచి ఫ్యూచర్
యువత క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, పోలీసు శాఖలో డీఎస్పీగా అపాయింట్ అయిన నిఖత్ జరీన్ మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందవచ్చని మంత్రి వివేక్ అన్నారు. షేక్‌పేట్ జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న సబ్ జూనియర్ స్టేట్ బాక్సింగ్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.