కొత్తూరులో తన్నుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు..

కొత్తూరులో  తన్నుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు..

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని వైఎం తండాలో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి సంబంధించి  కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగారు.  కొత్తూరు మండలం మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట ఎంపీపీ వై. రవీందర్ యాదవ్  తమ పార్టీల తరఫున మద్దతుగా సంఘటన స్థలానికి చేరుకొని వాగ్వాదం చేసుకున్నారు. ఇరువురి నాయకుల మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా అనుచరలు పరస్పర దాడికి దిగారు.  రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఎందుకోసం అంటే..
        
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజేశ్వరరావు కొనసాగుతున్నారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కౌన్సిలర్ పొన్నటంటి మల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ప్రస్తుత చైర్మన్ పై మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది. మొత్తం 30 వార్డులు ఉన్న జమ్మికుంట మున్సిపాలిటీలో ఇరువురికి 15 చొప్పున సమ బలాలు ఉన్నాయి. ఇందులో ఓ వర్గం తమ కౌన్సిలర్లను రంగారెడ్డి జిల్లా కొత్తూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో దాచినట్లు మరో వర్గానికి తెలియడంతో నాయకులు వారిని పట్టుకునేందుకు రోడ్డెక్కారు. కౌన్సిలర్ల కోసం ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న  పోలీసులు వేల సంఖ్యలో గుమికూడిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టారు.