ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీలో బీభత్సం.. మార్చి 20వ తేదీ సోమవారం ఉదయం సభ సమావేశం కాగానే.. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభను జరగకుండా అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల తీరుకు కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. టీడీపీకి పోటీగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరును నిరసిస్తూ.. నినాదాలు చేశారు.  స్పీకర్ పోడియం దగ్గర వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ సమయంలోనే వైసీపీ .. టీడీపీ ఎమ్మెల్యేల మధ్య మాటమాటా పెరిగింది. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువురి మధ్య ఓ దశలో తోపులాట జరిగింది. ఓ దశలో ఈ ఎమ్మెల్యేలు ఇద్దరూ కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  సభలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట సైతం జరిగింది. సభ్యులను కంట్రోల్ చేయటానికి ఎంతో ప్రయత్నించారు స్పీకర్. సభ్యులు సంయమనం పాటించాలని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు ఎంతకూ వినకపోవడంతో శాసనసభను స్పీకర్ వాయిదా వేశారు. 


ఎస్సీ, ఎస్టీ అయిన తనపై కావాలని తమ పార్టీ  సభ్యుల చేత చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. సభలో తనపై దాడి చేసిన విజువల్స్ విడుదల చేయాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. 


ఏపీ సీఎం జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు సీట్లలో గెలవడంతో వైసీపీ సభ్యులకు మైండ్ పోయిందన్నారు. వారికి మెదడు పనిచేయడం లేదని విమర్శించారు. అందుకే తమ సభ్యులపై వైసీపీ సభ్యులుదాడికి పాల్పడ్డారని చెప్పారు. ఏపీ చరిత్రలో శాసన సభ అంటే దేవాలయంతో సమానమని..అలాంటి దేవాలయంలో  స్పీకర్ సమక్షంలో  వైసీపీ ఎమ్మెల్యేలు తమ దళిత సభ్యుడిపై దాడి చేయడం దారుణమన్నారు.  75 ఏండ్ల వయసున్న ఎమ్మె్ల్యే గోరంట్ల బుచ్చయ్యపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడి చేశారన్నారు.