‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్పై లొల్లి.. అన్నపూర్ణ స్టూడియో ముందు పెద్ద రచ్చే అయితుంది!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్పై లొల్లి.. అన్నపూర్ణ స్టూడియో ముందు పెద్ద రచ్చే అయితుంది!

హైదరాబాద్: పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ఉద్రిక్తతకు దారితీసింది. వేతనాలు పెంచాలని తెలుగు సినీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో టాలీవుడ్లో సోమవారం చాలా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే.. అన్నపూర్ణ స్టూడియోస్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ను మైత్రి సంస్థ కొనసాగించింది. 

ముంబై నుంచి సినీ కార్మికులు, డ్యాన్సర్లు తీసుకొచ్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కొనసాగించడంతో తెలుగు సినీ కార్మికులు అన్నపూర్ణ స్టూడియో వైపు దూసుకొచ్చారు. గేట్లు బద్ధలు కొట్టుకుని లోపలికి వెళ్లి షూటింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వందలాది మంది కార్మికులు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకుని నిరసన కొనసాగించడంతో పోలీసులు స్పాట్కు చేరుకుని కార్మికులతో మాట్లాడారు.

ఒకపక్క బంద్ చేస్తుంటే.. ముంబై కార్మికులతో షూటింగ్ కొనసాగించడం ఏంటని సినీ కార్మికులు మైత్రి సంస్థపై, పవన్ కల్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ కార్మికులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుందామని భావిస్తుంటే.. ఆయన సినిమా షూటింగ్నే ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి మరీ కొనసాగించడంపై తెలుగు సినీ కార్మికులు మండిపడ్డారు. తెలుగు సినీ కార్మికుల కష్టం పవన్ కళ్యాణ్కు తెలియదా అని నిరసనకారులు నిలదీశారు.

సోమవారం నుంచి షూటింగ్స్ బంద్ చేయాలని టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్స్‌‌లో పాల్గొనే వారికి 30 శాతం వేతనాలు పెంచాలని.. వేతనాలు పెంచితేనే షూటింగ్‌‌లో పాల్గొంటామని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. వేతనాలు పెండింగ్ పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇతర భాషల సినిమాలు, వెబ్‌‌సిరీస్‌‌లకు ఇది వర్తిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లేఖను విడుదల చేసింది.

గతంలో సినీ కార్మికుల వేతనాలు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం  పెంచాలని  ఒప్పందం జరగ్గా ఆ నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది. దాని గురించి ఫిల్మ్ ఛాంబర్,  ఫిల్మ్ ఫెడరేషన్   మధ్య పలుమార్లు చర్చలు జరగ్గా అవి విఫలం అయ్యాయి. ఆదివారం జరిగిన  చర్చలు కూడా  విఫలం కావడంతో బంద్  నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న చిత్రాలపై ప్రభావం పడనుంది.