హైదరాబాద్: నిజామాబాద్‌లోని వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) చైర్మన్ పీర్ల సురేష్ కుమార్‌ను ఈ నెల 3న కోర్టుకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామంలోని 300 ముదిరాజ్ కుటుంబాలపై సామాజిక బహిష్కరణ విధించడంపై గ్రామస్తులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి.. సురేశ్‌ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఒకవేళ ఇరుపక్షాలు కలిసే ఉన్నామని.. ఎలాంటి గ్రామబహిష్కరణ లేదని గ్రామంలో దండోరా వేయించిన వీడియోని సమర్పిస్తే ఈ హాజరు మినహాయింపుపై ఆలోచిస్తామని విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఒక ఆలయ భూమిని దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ప్రయత్నించిన ముదిరాజ్ కమ్యూనిటీని సామాజిక బహిష్కరణ చేసినట్టుగా వీడీసీ చైర్మన్‌పై జాగర్ల గంగ నరసయ్య, మరో నలుగురు గ్రామస్తులు పిటిషన్ దాఖలు చేశారు. సురేశ్ చర్య వల్ల ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అందులో వారు పేర్కొన్నారు.
