పోస్టుల భర్తీకి కొత్త రోస్టర్ రెడీ చేసిన ఉన్నత విద్యా మండలి

పోస్టుల భర్తీకి కొత్త రోస్టర్ రెడీ చేసిన ఉన్నత విద్యా మండలి
  • కామన్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీకి చర్యలు
  • త్వరలోనే గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది.15 యూనివర్సిటీల పరిధిలో సుమారు 2 వేల టీచింగ్ పోస్టులను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్ అంతా ఇదివరకే రెడీ అయింది. అయితే, ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి10 శాతానికి పెంచడంతో కొత్త రోస్టర్​కు అనుగుణంగా మళ్లీ పోస్టుల విభజన ప్రక్రియను ఉన్నత విద్యామండలి అధికారులు పూర్తిచేశారు.

సర్కారు వర్సిటీల్లో ఏండ్ల నుంచి పోస్టులను భర్తీ చేయకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో టీచింగ్ పోస్టులను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని, నాన్ టీచింగ్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా నింపాలని సర్కారు నిర్ణయించింది. తొలిదశలో 2 వేల టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. రిక్రూట్మెంట్ బోర్డునూ సర్కారు నియమించింది.

బోర్డు చైర్మన్​గా ఉన్నత విద్యామండలి చైర్మన్​నే నియమించారు. అసెంబ్లీలో బోర్డుకు ఆమోదం తెలిపి, గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. బోర్డుపై పలు అనుమానాలున్నట్టు ఈ మధ్యనే గవర్నర్​ లేఖ రాయగా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు కలిసి గవర్నర్ కు ఆయా అంశాలను వివరించారు. తమ వివరణకు గవర్నర్ సంతృప్తి చెందినట్టు వారు చెప్తున్నారు.

త్వరలోనే బోర్డు నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ నుంచి ఆమోదముద్ర వచ్చిన నెల, నెలన్నర రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఆఫీసర్లు చెప్పారు. యూజీసీ నిబంధనల ప్రకారం రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూల ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

గ్రూప్ 4 ద్వారా నాన్ టీచింగ్ పోస్టులు

యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ పోస్టులను గ్రూప్ 4 ద్వారా భర్తీ చేయనున్నారు.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 26,  జేఎన్ఏఎఫ్ఏయూలో 2, జేఎన్టీయూలో 75, కాకతీయ యూనివర్సిటీలో 10, మహాత్మాగాంధీ వర్సిటీలో 4, ఉస్మానియాలో 375, పాలమూరులో 8, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీలో 47, ఆర్జీయూకేటీ–బాసర ట్రిపుల్ ఐటీలో 31, శాతవాహనలో 8, తెలంగాణ వర్సిటీలో 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ కూడా ఆమోదం తెలిపింది.