
తొర్రూరు, వెలుగు: బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తొర్రూరు లోని స్నేహా నివాస్‌లోని అనాథ బాలికలకు పండ్లు, స్వీట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి చీఫ్‌గెస్ట్‌గా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం15 రోజుల పాటు భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. అనంతరం అనాథ బాలికల బాగోగులు తెలుసుకొని కాసేపు వారితో ముచ్చటించారు. ప్రపంచ ఫొటోగ్రాఫర్స్ డే సందర్భంగా ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్‌లో ఫొటోగ్రాఫర్లను సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ కె.శశాంక, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ పొనుగోటి సోమేశ్వర రావు, జడ్పీ సీఈవో రమాదేవి, ఆర్డీవో రమేశ్‌బాబు పాల్గొన్నారు.
చెరువులో పడి ఒకరు మృతి
నెల్లికుదురు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామ చెరువులో పడి ఒకరు చనిపోయారు. పోలీసుల వివరాలిలా ఉన్నాయి.. మండలకేంద్రానికి చెందిన పోతర్ల భిక్షపతి(40) బంధువు గురువారం చనిపోగా అంత్యక్రియల కోసం వెళ్లి, చెరువులో స్నానం చేస్తూ మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు చెరువులో వెతకగా శుక్రవారం ఉదయం భిక్షపతి డెడ్ బాడీ కనిపించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సర్పంచ్, ఉపసర్పంచ్ పై సస్పెన్షన్ వేటు
నర్సింహులపేట(దంతాలపల్లి),వెలుగు: జీపీ నిధులు దుర్వినియోగం చేశారని గ్రామస్తుల ఫిర్యాదుతో సర్పంచ్, ఉపసర్పంచ్ లపై వేటు పడింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం జీపీ సర్పంచ్, ఉపసర్పంచ్ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అధికారుల ఎంక్వైరీ అనంతరం సర్పంచ్,ఉపసర్పంచ్ లను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ శశాంక శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జనగామలో కిసాన్ సంఘ్కార్యవర్గ సమావేశం
జనగామ అర్బన్, వెలుగు: భారతీయ కిసాన్ సంఘ్ జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యవర్గ సమావేశం శుక్రవారం జనగామలో జరిగింది. రెండు జిల్లాల అధ్యక్షులు కర్ర రాజిరెడ్డి, పోకల యాదగిరి, నిమ్మతి శ్రీనివాస రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిల భారత కిసాన్సంఘ సభ్యులు, తెలంగాణ ఇన్చార్జి నానా థాక్రే హాజరయ్యారు. సమావేశంలో జోనల్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, మురళీధర్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, అలివేలు పాల్గొన్నారు.
జాతిని జాగృతం చేసేవి యూనివర్సిటీలు
హసన్ పర్తి,వెలుగు: జాతిని జాగృతం చేసేవి యూనివర్సిటీలని కేయూ వీసీ తాటికొండ రమేశ్పేర్కొన్నారు. శుక్రవారం కేయూలో జరిగిన విశ్వవిద్యాలయ 47 వ ఆవిర్భావ దినోత్సవంలో వీసీ రమేశ్ పాల్గొన్నారు. ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
టీఆర్ఎస్ సభ్యత్యానికి జేఎస్ఆర్ రాజీనామా
భీమదేవరపల్లి, వెలుగు: టీఆర్ఎస్పార్టీ ప్రాథమిక సభ్యతానికి రాజీనామా చేస్తున్నట్లు వృక్ష ప్రసాద దాత సురేందర్ రెడ్డి(జేఎస్ఆర్) తెలిపారు. శుక్రవారం ముల్కనూర్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్.. కుటుంబ పార్టీగా మారిపోయిందన్నారు. ఈనెల 21న మునుగోడులో జరగనున్న మహాసభలో హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు.
దేశ రక్షణలో సైనికుల సేవలు మరువలేనివి
మహబూబాబాద్, వెలుగు: దేశ రక్షణలో సైనికుల సేవలు మరువలేనివని కలెక్టర్ కె.శశాంక, ఎస్పీ శరత్చంద్రపవార్పేర్కొన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా బయ్యారం మండలకేంద్రంలో సైనిక కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లాలో బయ్యారం మండలం నుంచి సుమారు 52 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారన్నారు. ఎస్పీ మాట్లాడుతూ దేశానికి ఆర్మీ జవాన్లు చేసే త్యాగాలను గుర్తుచేసుకోవాలన్నారు.కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
కబడ్డీ ఫ్రీడమ్ కప్ విన్నర్ సంగెం టీమ్
వరంగల్ సిటీ, వెలుగు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్(బొల్లికుంట) గ్రౌండ్లో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ కబడ్డీ పోటీల్లో మామునూరు జట్టుపై సంగెం టీమ్ విజయం సాధించింది. ఈ సందర్భంగా సీపీ డా.తరుణ్ జోషి, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం విన్నర్, రన్నర్ జట్లకు ట్రోఫీలను అందజేశారు. '
500 ఆటోలను పరిశీలించి.. బాధితునికి హెల్ప్చేసిన పోలీసులు
ఎన్‍ఐటీలో కౌన్సిలింగ్‍కు వచ్చి సర్టిఫికేట్లు పొగొట్టుకున్న రాహుల్ శర్మ
వరంగల్, వెలుగు: రాజస్థాన్‌కు నుంచి అడ్మిషన్‌కోసం వచ్చి సర్టిఫికేట్లు పొగొట్టుకున్న స్టూడెంట్కోసం పోలీసులు 500 ఆటోలను పరిశీలించి హెల్ప్‌చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రాజస్థాన్ కు చెందిన రాహుల్‍శర్మ వరంగల్ ఎన్‍ఐటీలో అడ్మిషన్ కోసం గురువారం వరంగల్ వచ్చాడు. హనుమకొండ బస్టాండ్‍కు వెళ్లేందుకు ఆటో ఎక్కి అందులోనే సర్టిఫికేట్లు, ల్యాప్ట్యాప్ఉన్న బ్యాగును మరిచిపోయాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే రాత్రి కావడంతో పోలీసులు సిటీ పరిధిలోని వాట్సాప్ గ్రూపుల్లో రాహుల్ పరిస్థితి తెలిసేలా పోస్టింగులు పెట్టారు. శుక్రవారం సీసీఎస్ సీఐ రాపర్తి సంతోష్‍కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బాధితుడు ఆటో ఎక్కి, దిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో పూర్తిస్థాయి స్పష్టత లేకున్నా.. ఆటో వెనకాల సిటీలోని ఆకాశ్ ఇనిస్టిట్యూట్‍కు చెందిన పోస్టర్‍ను గమనించారు. హనుమకొండలోని ఆ ఇనిస్టిట్యూట్ కు వెళ్లి ఎంక్వైరీ చేయగా సిటీ పరిధిలో 500 ఆటోలకు పోస్టర్లు వేసినట్లు చెప్పారు. ఈక్రమంలో ఆ 500 ఆటోల ఫొటోల్లో రాహుల్ శర్మను పిలిపించి అతను ప్రయాణించిన ఆటోను గుర్తుపట్టమని చెప్పడంతో ఓ అయిదింటిని గుర్తించాడు. ఆ ఆటోడ్రైవర్ల సెల్‌నంబర్లను ట్రాక్‌చేసి చెక్‌చేశారు. చివరికి రాహుల్‍శర్మ ఎక్కిన ఆటోను గుర్తించి సర్టిఫికెట్లు, ల్యాప్‍టాప్ బ్యాగ్ ఇప్పించారు.
సంచార జాతులకు కేసీఆర్ అన్యాయం
- సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారుతయ్
- ఏడాదిగా ప్రజల కష్టాలను స్వయంగా చూస్తున్నా
- అధికారంలోకి వచ్చాక సంచార జాతులను ఆదుకుంటాం
- రచ్చబండలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
జనగామ, వెలుగు : బీసీ ద్రోహి కేసీఆర్‌ను గద్దె దించాలని బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. సంచార జాతులకు సర్కారు తీవ్ర అన్యాయం చేస్తోందని, గాజులమ్మే పూసల సహా సంచార జాతులన్నీ ఇంటింటికీ తిరిగి కేసీఆర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని కోరారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం జనగామ నుంచి చిటకోడూరు, చౌడారం, రామచంద్రగూడెం, లక్ష్మీతండా, మాదారం, ఖిలాషాపూర్ వరకు పాదయాత్ర చేపట్టారు. చిటకోడూరులో సంచార జాతుల వారితో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా పూసల వారు బండి సంజయ్ ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చడం లేదని, ఎంబీసీ కార్పొరేషన్ నుంచి కూడా తమకు ఎలాంటి సాయం అందించడం లేదని, పిల్లలను చదివించుకునే స్తోమత కూడా లేదని వాపోయారు. చంకలో బిడ్డను ఎత్తుకుని తిరుగుతూ గాజులు అమ్ముకుని బతికే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామన్నారు. తాను కూడా సంచారజాతివాడిని అయ్యాయని, ఏడాదిగా మీ కష్టాలను తెలుసుకునేందుకు ఊరూరు తిరుగుతున్నానని సంజయ్పేర్కొన్నారు. తెలంగాణలో సంచార జాతుల జనాభా 30 లక్షలు ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌కు బెల్టు షాపులు తప్ప, మీ బాధలు పట్టవన్నారు. అనంతరం అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్లను బండి సంజయ్సన్మానించారు.
నీళ్లల్లోనే పాదయాత్ర
జనగామ శివారు నుంచి చిటకొడూరులోకి ప్రవేశించిన బండి సంజయ్ రోడ్డు పై ప్రవహిస్తున్న నీటిలో నుంచే ముందుకు సాగారు. భారీ వర్షం పడితే పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోతాయని గ్రామస్థులు బండి సంజయ్ వద్ద వాపోయారు. స్పందించిన ఆయన బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, తిరుపతి రెడ్డి, పవన్ శర్మ, సౌడ రమేశ్, శివరాజ్‌యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.